మనదేశంలో వరకట్నం అనేది ఎప్పటి నుంచో ఉన్న సాంఘిక దురాచారం. దీనివల్ల ఎంతోమంది యువతులు బలైపోతున్నారు. కట్నం ఇవ్వలేక కొందరికి పెళ్ళిళ్ళు కావడం లేదు. కొందరు బొటాబొటి కట్నం ఇచ్చి అత్తవారింట్లో ఉంటూ వారు పెట్టే టార్చర్‌కు నరకం అనుభవిస్తున్నారు. కొందరు ఏకంగా తమ ప్రాణాలనే తీసుకుంటున్నారు. అయినప్పటికీ మనదేశంలో ఈ దురాచారం ఇంకా పోలేదు. ఇప్పటికీ అలాగే ఉంది. దీంతో ఆడపిల్ల తల్లిదండ్రులు లక్షలు పోసి తమ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే భయపడిపోతున్నారు.
వరకట్నం విషయానికొస్తే దాన్ని వద్దు అనేవారు ఎవరూ ఉండరు. అందరూ తీసుకుంటారు. అయితే ఒక అబ్బాయి మాత్రం కట్నం తీసుకోలేదు. తాను వివాహం చేసుకోబోయే అమ్మాయికి ఆస్తి బాగా ఉన్నా కట్నం మాత్రం అతను తీసుకోలేదు. రాజస్థాన్ లోని జోథ్‌పూర్ ప్రాంతం. అక్కడ ఈ మధ్యనే భన్వర్ సింగ్ షెకావత్ అనే వ్యాపారి కుమారుడు సిద్థార్త్‌కు అదే ప్రాంతానికి చెందిన రిసిరాజ్ కుమార్తె నీరజ్ కన్వార్‌కు వివాహమైంది. వివాహం తరువాత జరిగే కార్యక్రమంలో భాగంగా 5 లక్షల కట్నాన్ని ఇచ్చారు.
అయితే దాన్ని పెళ్ళికుమారుడు సిద్ధార్త్ వ్యతిరేకించాడు. తమ వర్గంలో కట్నం తీసుకోవడం సాంప్రదాయంగా వస్తుందని, కాబట్టి దాన్ని తీసుకోవాలని చాలామంది చెప్పారు. అయినప్పటికీ అందుకు తాను ఒప్పుకోలేదు. తనకు కేవలం ఒక్కరూపాయి కట్నం ఇస్తే చాలని సిద్ధార్థ్ అన్నారు. అంతేకాదు తాను ఈ పనిచేయడం వల్ల సొసైటీలో ఇతరులకు మెసేజ్ వెళుతుందని, దీంతో కొందరైనా కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకుంటారని చెప్పాడు. ఆ వివాహం వీడియో కాస్త వాట్సాప్‌లో షేర్ అయ్యి వైరల్‌గా మారింది. సిద్థార్త్‌ను అందరూ అభినందించారు.