ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే... మర్డర్ కేసులో అనుమానితుడిగా బండ్ల గణేష్‌ను పరిచయం చేశారు. సినిమాలో ఆయన పేరు డేగల బాబ్జీ. ట్రైలర్ అంతా ఆయన ఒక్కరే ఉన్నారు. 'యాభై దెయ్యాలు సార్... అవి నన్ను బెదిరిస్తున్నాయి. భయపెడుతున్నాయి', 'కోపం... కోపం... భరించలేనంత కోపం', 'పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ, వాడు పుట్టిన అప్పటన్నుంచి నేను ఏడుస్తున్నాను', 'పొట్టిగా ఉన్నా... మా అమ్మ అందంగా ఉంటుంది. అసలు మా అమ్మ అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా?'... డైలాగులు చెప్పేటప్పుడు నటుడిగా బండ్ల గణేష్ వేరియేషన్ చూపించారు.
'డేగల బాబ్జీ' టైటిల్ పోస్టర్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంటిపై కత్తిగాటుకు వేసిన కుట్లు, గాయం నుండి కారుతున్న రక్తపు బొట్టుతో గణేష్ గెటప్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడీ ట్రైలర్ సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శక - నిర్మాతలు మాట్లాడుతూ "తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా ఇది. సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నాయి. అయితే, వాళ్ల వాయిస్ వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు. హీరోగా డేగల బాబ్జీ పాత్రలో బండ్ల గణేష్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ చేశారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్‌కూ మంచి స్పందన లభిస్తోంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం" అని అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), కళా దర్శకత్వం: గాంధీ, కూర్పు: ఎస్.బి. ఉద్దవ్, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, కథ: ఆర్. పార్తిబన్, మాటలు: మరుధూరి రాజా, వైదేహి, సంగీతం: లైనస్ మధిరి, సమర్పణ: రిషి అగస్త్య, నిర్మాణ సంస్థ: యష్ రిషి ఫిలిమ్స్ దర్శకత్వం: వెంకట్ చంద్ర, నిర్మాణం: స్వాతి చంద్ర.