Hrithik Roshan, Jr. NTR - War 2
నటీనటులు : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ, అసుతోష్ రానా, అనీల్ కపూర్ తదితరులు.
సాంకేతికత: సినిమాటోగ్రఫీ : బెంజమిన్ జాస్పర్, సంగీతం దర్శకులు: ప్రీతమ్, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార, దర్శకుడు : అయాన్ ముఖర్జీ, నిర్మాత : ఆదిత్య చోప్రా.
ఈరోజు రజనీకాంత్ కూలీ తోపాటు బాలీవుడ్ సినిమా వార్ 2 కూడా విడుదలైంది. ఇందులో ఎన్టీఆర్ బాలీవుడ్ లో పరిచయం అవుతుండగా, హృతిక్ రోషన్ తెలుగులో పరిచయం అవుతున్నారు. ఈ సినిమా లో ఎన్.టి.ఆర్. ది నెగెటివ్ పాత్ర అయి, రోబో తరహాలో వుంటుందని విడుదలకుముందు కథనాలు వచ్చాయి. మరి అందులో నిజమెంతో తెలుసుకోవాలంటే వార్ 2 రివ్యూ చూడాల్సిందే.
కథ:
ఇండియన్ రా ఏజెన్సీలో ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) ను అపాంయింట్ మెంట్ పై అధికారులు ఇస్తారు. అదే టైంలో ఇండియాను నాశనం చేయాలని చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, రష్యా, శ్రీలంక వంటి దేశాలు కలిసి కలి పేరుతో భారత్ ను నాశనం చేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఇది తెలిసిన రా అధినేతలు అందుకు సరైన వాడు కబీర్ అని బాధ్యతలు అప్పగిస్తారు. అయితే రా లో పై అధికారులు కబీర్ మీద కూడా కన్నేసి విక్రమ్ చలపతి (జూనియర్ ఎన్టీఆర్) రంగంలోకి దింపుతారు.
అధికారులకు కబీర్ పై ఎందుకు అనుమానం వచ్చింది. అసలు విక్రమ్ చలపతినే ఎందుకు ఎంచుకున్నారనేది సినిమాలోని ఆసక్తికరపాయింట్. ఈ క్రమంలో వింగ్ కమాండర్ కావ్య లుత్ర (కియార అద్వానీ) పాత్ర ఏమిటి? ఇతర దేశాలు ఇండియాను ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాయి? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
సహజంగా రా ఏజెంట్ సినిమాలన్నీ నేపథ్యాలు వేరయినా భారీ కథతో సాగుతాయి. అందులో చాలా యాక్షన్, హింస కూడా వుంటుంది. ఈమధ్య యాక్షన్ సినిమాలు బాగా ఆదరణ పొందుతున్నాయి. ఆ కోణంలో ఈ సినిమా వుంటుంది. సినిమా ఆరంభం నుంచే ఒకదాన్ని మించి మరొక యాక్షన్ సీక్వెన్స్ అంతకు మించిన టెక్నీకల్ వాల్యూస్ తో కనువింద చేసేలా దర్శకుడు తీశాడు.
పాత్రల ట్విస్ట్ లు చూస్తే సలార్ కథను తలపిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా రుతిక్ రోషన్ నటన, యాక్షన్, డాన్స్ తో తెలుగు వారిని ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఇద్దరూ అంచనాలుకి ఏమాత్రం తీసిపోని విధంగా నటించారు. వార్ 1 లో హృతిక్ ని చూసాం కానీ ఇందులో మాత్రం తారక్ సర్ప్రైజ్ షేడ్స్ అని చెప్పాలి. ఇగోయిస్ట్ గా ఆయన నటన జై లవకుశ, టెంపర్ పాత్రలను గుర్తు చేస్తాయి. సాత్వికుడిగా వుండే పాత్రలో రుతిక్ అమరాడు. క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఫైట్స్ కానీ ఎమోషనల్ సీన్స్, ఇద్దరిపై ఆకట్టుకుంటాయి.
ఇక కియార తన గ్లామర్ తో లిప్ కిస్ లతో యూత్ ను గిలిగింతలు పెడుతుంది. ఫస్టాఫ్ లో మంచి యాక్షన్ సీన్స్ దక్కాయి. వీరితో పాటుగా అసుతోష్ రానా బాగా చేశారు. ఇక సర్ప్రైజ్ నటుడు అనీల్ కపూర్ కూడా బాగానే చేశారు.
అయితే దేశభక్తి కలిగించే కథ కనుక దానిని మరింత లోతుగా తీస్తే బాగుండేది. జేమ్స్ బాండ్ సినిమాల్లో అవి స్పష్టంగా కనిపిస్తాయి. అన్ని దేశాలు ఇండియాను నాశనం చేయాలనుకోవడమనేది డేర్ తో తీసిన సినిమా. ఒకపక్క చైనాతోనూ ఇతర దేశాలతోనూ ప్రధాని రాకపోకలు సాగిస్తూ, చర్చలు జరుగుపుంటే వారిని దేశద్రోహులుగా చూపించడం సరికొత్త విషయమనే చెప్పాలి. ముఖ్యంగా చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఆ విషయాన్ని ధైర్యంచేసి చెప్పలేని స్తితి నేడు వుంది. ఇలాంటి సినిమాలవల్లనైనా ప్రేక్షకుల్లో అవగాహన వస్తుందనేందుకు సినిమా తీసినట్లుంది.
అనీల్ కపూర్ రోల్ కూడా మొదట్లో బానే అనిపిస్తుంది కానీ తర్వాత ఇరికించిన భావన కలుగుతుంది. ఇక ఎన్టీఆర్ పాత్ర హీరోనా, విలనా అనే కన్ ఫ్యూజ్ క్రియేట్ చేశాడు దర్శకుడు. హృతిక్ ని తారక్ ఛేజ్ చేసే ఆ సీక్వెన్స్ ఎందుకలా డిజైన్ చేశారో మేకర్స్ కే తెలియాలి.
భారీ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. యాక్షన్ పార్ట్ వరకు భారీ మొత్తంలో ఖర్చు పెట్టారు. యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీలు బాగున్నాయి. అలాగే ప్రీతం మ్యూజిక్ బాగా వర్క్ అయ్యింది. సినిమాలో ఎడిటింగ్ కొన్ని సన్నివేశాల్లో బాగా చేయాల్సింది.
ఇక దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇద్దరు హీరోస్ ని తను హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. ఏదిఏమైనా ఇటువంటి కథలో ఇంతకంటే జాగ్రత్తలు తీసుకోలేమని చూసేవారికి అనిపిస్తుంది. ఇరు హీరోల లవర్స్ కి యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ అని చెప్పవచ్చు. కథలో లాజిక్స్ తో పెద్దగా సంబంధం లేకుండా ఇరు హీరోల హోరాహోరీ వార్ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో చూడాలి. యాక్షన్ ప్రియులకు ఈ సినిమా నచ్చుతుంది.