Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప్పెన రివ్యూ రిపోర్ట్.. స్టోరీ లైన్ ఎలా వుందంటే.. ప్రేమను కొత్తగా..?

ఉప్పెన రివ్యూ రిపోర్ట్.. స్టోరీ లైన్ ఎలా వుందంటే.. ప్రేమను కొత్తగా..?
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (14:16 IST)
Uppena
ఉప్పెన రివ్యూ రిపోర్ట్‌ అదిరింది. మెగా హీరో నటించిన ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంకా ఉప్పెన స్టోరీ లైన్ అదిరిందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇక ఉప్పెన స్టోరీ లైన్ ఎలా వుందంటే..? ఉప్పాడ ప్రాంతంలో కోటగిరి శేషారాయనం(విజయ్‌ సేతుపతి) రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ప్రాణం కంటే పరువుప్రతిష్టలే మిన్నగా బతుకుతుంటాడు. అతడి కూతురు బేబమ్మ(కృతిశెట్టి) కాకినాడ కాలేజీలో డిగ్రీ చదువుతుంటుంది. 
 
ఆశీ(వైష్ణవ్‌తేజ్‌) ఓ జాలరి. తండ్రి జాలయ్యతో(సాయిచంద్‌) కలిసి సముద్రంలో చేపలు పట్టుకుంటూ బతుకుతుంటాడు. బేబమ్మను చిన్ననాటి నుంచి ఆశీ ప్రేమిస్తుంటాడు. కానీ తన ప్రేమను ఆమెకు వ్యక్తంచేయడు. ఓ సంఘటన వారిద్దరిని కలుపుతుంది. ఆశీతోనే జీవితాన్ని పంచుకోవాలని బేబమ్మ కలలు కంటుంది. వారి ప్రేమ విషయం బేబమ్మ తండ్రి శేషారాయనానికి తెలుస్తుంది. తన పరువును కాపాడుకోవడం కోసం ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? శేషారాయనం బలాన్ని, బలగాన్ని ఎదురించి ఆశీ, బేబమ్మ తమ ప్రేమను నిలబెట్టుకున్నరా? ఆశీ పట్ల కూతురికి ఉన్న ప్రేమను శేషారాయనం ఎలా గుర్తించాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
 
విశ్లేషణ:
ప్రేమంటే ఫిజికల్‌ రిలేషన్‌షిప్‌తో ముడిపడింది కాదు అది మనసులతో పెనవేసుకున్న స్వచ్ఛమైన బంధం అనే పాయింట్‌తో దర్శకుడు బుచ్చిబాబు ఈ కథను రాసుకున్నారు. ఈ అంశానికి సమాజంలో ఉన్న కుల అంతరాలను జోడిస్తూ సినిమాను తెరకెక్కించారు. గతంలో తెలుగులో ఎవరూ స్పృశించని కొత్త పాయింట్‌ను దర్శకుడు ఇందులో టచ్‌ చేశారు. ఇలాంటి ఇతివృత్తంతో సినిమా చేయడానికి కొంత ధైర్యం కావాలి. ఈ సున్నితమైన అంశాన్ని చెప్పడంలో దర్శకుడు కొంత తడబడినా అది కామెడీగా మారిపోతుంది. కానీ బుచ్చిబాబు మాత్రం తొలి సినిమాలోనే తాను చెప్పాలనుకున్న అంశాన్ని కన్వీన్సింగ్‌గా తెరపై ఆవిష్కరించారు.
 
నటీనటులు 
తాను రాసుకున్న కథకు తగ్గ ప్రతిభావంతులైన నటుల్ని ఎంచుకోవడంలో బుచ్చిబాబు చాలా వరకు విజయవంతమయ్యారు. శేషారాయనం పాత్రలో విజయ్‌సేతుపతి జీవించారు. పరువు కోసం నిరంతరం తపన పడే తండ్రిగా ఆయన నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆయన కనిపించే ప్రతి సన్నివేశం సినిమా పట్ల ఆసక్తిని మరింత పెంచుతుంది. ఆశీ, బేబమ్మగా వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంట చక్కగా కుదిరారు.
 
తొలి సినిమా కోసం చాలా మంది హీరోలు రొమాంటిక్‌, యాక్షన్‌ సినిమాల్ని ఎంచుకుంటారు. మెగా హీరో వైష్ణవ్‌తేజ్‌ మాత్రం సవాల్‌తో కూడిన డీ గ్లామర్‌ పాత్రను ఎంచుకున్నాడు. ఆశీ అనే జాలరిగా సహజ నటనను కనబరిచాడు. కృతిశెట్టి చక్కటి నటన, హావభావాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా పతాక ఘట్టాల్లో విజయ్‌ సేతుపతితో పోటీపడి నటించింది. హీరో తండ్రి పాత్రలో సాయిచంద్‌ ఒదిగిపోయారు.
 
దర్శకుడిగానే కాకుండా కథకుడిగా, సంభాషణల రచయితగా బుచ్చిబాబు ప్రతిభను చాటుకున్నారు. 'ఉప్పెన' కథ మొత్తం సముద్రంతోనే ముడిపడి సాగుతుంది. ఆ సన్నివేశాలన్నీ ఈ ప్రేమకథకు కొత్త శోభను సంతరించాయి. తాను పుట్టిపెరిగిన ప్రాంతం కావడంతో అక్కడి వాతావారణం, యాస భాషల్ని కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు తెరపై ఆవిష్కృతం చేసిన తీరు బాగుంది. 
 
ఈ ప్రేమకథా చిత్రానికి గుర్తుండిపోయే బాణీలను అందించారు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌. నీ కన్ను నీలి సముద్రం, రంగులద్దుకున్న, జల జల జలపాతంతో పాటు ప్రతి పాట మెలోడీగా సాగుతూ ప్రేక్షకుల్ని కథలో లీనమయ్యేలా చేసింది. సముద్ర అందాలను ఛాయాగ్రహకుడు షామ్‌దత్‌ చక్కగా చూపించారు. కొత్త దర్శకుడైనా ఆయన కథను, ఆలోచనల్ని నమ్మి సుకుమార్‌ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ హంగులతో ఈ సినిమాను నిర్మించాయి.
 
తెలుగు తెరపై గతంలో వచ్చిన ప్రేమకథలకు పూర్తి భిన్నంగా సాగే చిత్రమిది. రివ్యూ అదిరింది.. మార్కులు ఐదుకు మూడున్నర వేసేయవచ్చునని సినీ పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థినిని విందుకు పిలిచి వైస్ ప్రిన్సిపాల్‌ అలా ప్రవర్తించాడు