నటీనటులు: రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే, పూర్ణ, మధు నందన్, అజయ్, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర, ధన్‌రాజ్ తదితరులు.
సాంకేతికతః ఛాయాగ్రహణం: ఐ. ఆండ్రూ; సంగీతం: సురేష్ బొబ్బిలి; కథ, మాటలు: నంద్యాల రవి, నిర్మాతలు: మహిధర్, దేవేశ్; సమర్పణ: శ్రీమతి పద్మ; స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా.
రాజ్ తరుణ్ సినిమా అంటే యూత్‌ఫుల్గా వుంటాయి. అందులో కొండా విజయకుమార్ కాంబినేషన్‌లో ఒరేయ్ బుజ్జిగావంటి వినోదాత్మక సినిమా వచ్చింది. తాజాగా వీరి కాంబినేషన్‌లో పవర్ ప్లే ఈరోజే విడుదలైంది. అయితే టైటిల్‌లో మైండ్‌తో ఆడే కథతో రూపొందిందనేది తెలిసిపోయింది. దానికి తోడు టీజర్ ఆసక్తి కలిగింది. మరి ఈ సినిమా ఏరకంగా వుందో చూద్దాం.
కథగా చెప్పాలంటే,
విజయ్ (రాజ్‌తరుణ్) మధ్యతరగతి కుటుంబం. ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్స్ కోసం కష్టపడుతుంటాడు. అతనికి స్వీటీ (హేమల్) అంటే ప్రేమ. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అబ్బాయికి ఉద్యోగం లేదన్న కారణంతో స్వీటీ తండ్రి పెళ్లికి అడ్డు చెబుతాడు. విజయ్ తండ్రి తన జాబ్‌ను కొడుక్కి వచ్చేలా చేస్తాడు. అన్నీ సవ్యంగా వున్న తరుణంలో విజయ్ జీవితం అనుకోని చిక్కుల్లో పడుతుంది. తను చేయని నేరానికి జైలు పాలవుతాడు. ఒక్క రాత్రిలోనే అతని జీవితం తలకిందులై పోతుంది. ఓవైపు సమాజం చీదరింపులు, మరోవైపు కుటుంబం రోడ్డున పడడం, ప్రేమించిన అమ్మాయి దూరం కావడం జరిగిపోతాయి. వీటన్నిటికి కారణం ఒకరని భావించి అతన్ని ఛేదించి పట్టుకుంటే ఆసక్తికరమైన ట్విస్ట్ కనబడుతుంది. చివరికి ముఖ్యమంత్రి కుమార్తె పూర్ణ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. అసలు ఆమెకు ఈ కేసుకు సంబంధం ఏమిటి? చివరికి విజయ్ ఏం చేశాడు? అన్నది తక్కిన కథ.
విశ్లేషణః
సామాన్యుడు అనుకోని సంఘటనతో ఎలా ఇబ్బందులు పడతారనే పాయింట్ ఆసక్తికరంగా వుంది. సమాజంలో ఆన్‌లైన్ మోసాలు చాలానే జరుగుతున్నాయి. వాటిలో ఇది కొత్తగా వుంది. ఏటిఎం. సెటర్లలో ఫేక్ నోట్లు రావడం చాలామందికి అనుభవమే. వాటివల్ల సామాన్యుడి జీవితం ఏ విధమైన మలుపు తిరిగింది అనేది పాయింట్‌తో దర్శకుడు అల్లిన కథ వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా వుంది. అదేవిధంగా ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసు వ్యవస్థను ఏవిధంగా వాడుకుంటారనేది కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఆ క్రమంలో కొన్ని ఉపకథలు మరింత గట్టిగా రాసుకుంటే బాగుండేది.ఆరంభంలో కారు యాక్సిడెంట్,. దాని వల్ల డ్రగ్స్ మాఫియాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి రావడం వంటి సన్నివేశాలతో సినిమాని ఆసక్తికరంగా మొదలుపెట్టారు దర్శకుడు. తర్వాత విజయ్ పాత్ర పరిచయంతో కథలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
ఇందులో పూర్ణ పాత్ర చాలా కీలకం. అటువంటి పాత్రను ఆమె పోషించడంవల్లే సినిమా కాస్త ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత ఆమె వల్ల ఏర్పడ్డ చిక్కులు విజయ్ ఎలా విప్పతీశాడు అన్నది మిగిలిన కథ. అయితే ఇంటర్ పెద్దగా ఆసక్తి కనిపించకపోయినా ద్వితీయార్థంనుంచి కథ మలుపు తిరుగుతుంది. అందుకు కారణం పూర్ణ పాత్ర రావడమే. చాలా హుందా అయిన పాత్ర. ఆ పాత్ర చేసిన పనులే విజయ్ జీవితంలో పెనుమార్పులకు దారితీస్తుంది. అయితే ఆ విషయంలో ఇంకాస్త దర్శకుడు విజయ్ కేసుకు, ఆమె నేపథ్యానికి లింక్ బాగా రాసుకుంటే బాగుండేది.
నటనాపరంగా మధ్యతరగతి యువకుడిగా విజయ్ పాత్రలో రాజ్‌తరుణ్ చక్కగా ఒదిగిపోయారు. కథకు తగ్గట్లుగా ఆద్యంతం సీరియస్ లుక్‌లో కనిపిస్తూ.. తన పని తాను చేసుకుపోయాడు. హేమల్ పాత్ర పరిధి తక్కువే అయినా ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. పూర్ణ ప్రతినాయిక పాత్ర. ముందుముందు ఆమెను ఇటువంటి పాత్రలో చూడొచ్చు అనేలా వుంది. ఇక మధునందన్, అజయ్, రవి వర్మ తదితరులంతా పాత్రల పరిధి మేర నటించారు. థ్రిల్లర్ చిత్రానికి తగ్గట్లుగా కథ సిద్ధం చేసుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యారు. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం చిత్రానికి బలాన్నిచ్చింది. మొత్తంగా అందరూ చూడతగ్గ సినిమాగా చెప్పవచ్చు.