Jaanu Telugu Movie Review
నటీనటులు: శర్వానంద్, సమంత, వెన్నెల కిషోర్, శరణ్య తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
కెమెరా: జయరాజు
దర్శకత్వం: ప్రేమ్ కుమార్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేదీ: 07/02/2019
శర్వానంద్-సమంత జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాను. ఈ సినిమా కోలీవుడ్ 96కి రీమేక్. ఈ చిత్రం ఫిబ్రవరి 7వతేదీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం..
కథలోకి వెళ్తే..
జాను (సమంత), కె.రామచంద్ర (శర్వానంద్) స్కూల్‌లో చదువుతున్నప్పుడు ప్రేమించుకుంటారు. అయితే తెలియని కారణాల వల్ల విడిపోతారు. మళ్లీ 15 సంవత్సరాల తర్వాత స్కూల్ రీయూనియన్ ఫంక్షన్‌లో కలుసుకుంటారు. ఆ తరుణంలో వారు గుర్తుచేసుకున్న సంఘటనల సమాహారమే "జాను" చిత్రం.
విశ్లేషణ సంగతికి వస్తే..
స్కూల్ లవ్ అందరికీ స్పెషల్. అలాంటి పాయింట్ మీదే కథ రాసుకున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. విడిపోయిన ప్రేమికులు మళ్లీ 15 ఏళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుంది అనే లైన్‌తో ఇది వరకు చాలా సినిమాలు వచ్చాయి. జానులో అంతకంటే కొత్తగా ఏమీ కనిపించలేదు కానీ.. స్కూల్ డేస్ గుర్తుచేస్తూ దర్శకుడు చేసిన స్క్రీన్ ప్లే మ్యాజిక్ బాగా వర్కౌట్ అయ్యింది.
శర్వానంద్, సమంత కెమిస్ట్రీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా రియూనియన్ పార్టీ, సమంత ఎంట్రీ, స్కూల్ బ్యాక్ డ్రాప్‌తో పర్లేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కథను ఎమోషనల్‌గా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రెండో అర్థభాగం మాత్రం సుమంత్ నటించిన మళ్లీ రావా సినిమాను గుర్తుకు తెచ్చేలా వుంది.
మ్యాజికల్ మూమెంట్స్ బాగున్నాయి. కానీ స్లో నేరేషన్ ఈ సినిమాకు మైనస్. శర్వానంద్, సమంత అద్భుతంగా నటించారు. సెకండ్ హాఫ్‌లో కొన్ని మార్పులు చేసివుంటే బాగుండేది. ఏదైమైనప్పటికీ లవర్స్ డే కానుకగా వచ్చిన జాను.. తప్పకుండా యూత్‌కు బాగానే కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.