తారాగణం: కవిన్ - అపర్ణాదాస్, భాగ్యరాజా, విటివి గణేష్, మాస్టర్ ఇయాన్ తదితరులు..
సాంకేతికత: కెమెరా: ఎలిల్ అరసు, సంగీతం : జెన్ మార్టిన్, నిర్మాత : శ్రీమతి నీరజ కోట (ఎన్నారై), దర్శకత్వం: గణేష్ కె.బాబు
తమిళంలో "దాదా" పేరుతో విడుదలై అక్కడ దాదాపు 40 కోట్లు వసూలు చేసిన చిత్రాన్ని తెలుగులో "పాపా" పేరుతో అనువదించి థియేటర్లలో విడుదల చేశారు. ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం తమిళంలో క్రియేట్ చేసిన మ్యాజిక్ తెలుగులోనూ రిక్రియేట్ చేయగలుగుతుందా లేదా అనేది తెలుసుకుందాం.
కథ :
కాలేజీలో చదువుకుంటూనే ప్రేమలో పడిన ఓ జంట కథ. వారు వయస్సులో వున్న ఆకర్షణలకు లోనై హద్దులు దాటతారు. పెండ్లికాకుండానే ఇలా చేసిన వారి జీవితం ఎటువంటి మలుపులు తిరిగాయి. వయసులో ఉండే ఆకర్షణలు, ఆవేశాలు, అపార్ధాలు, తరాల మధ్య అంతరాలు, వ్యక్తుల మధ్య ఉండే ఇగోలు, ఫ్రెండ్ షిప్, హెల్పింగ్ నేచర్, ముఖ్యంగా బంధాలు, భావోద్వేగాల కలబోతగా "పాపా" చిత్రాన్ని దర్శకుడు గణేష్ బాబు ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు. దర్శకుడిగా ఇతని పేరు కచ్చితంగా ముందు ముందు మరింత వింటాం. అందులో సందేహం లేదు. కథగా చెప్పుకోవడానికి సింపుల్ గా ఉన్నా... కథనాన్ని రక్తి కటించిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
సమీక్ష:
ఒకప్పుడు చిత్రం అనే సినిమాను తేజ తీశారు. స్కూల్ డేస్ లోనే గర్భం దాల్చిన ఓ జంట కథను ట్రెండ్ సెట్ తోపాటు విమర్శలకు గురిచేసేలా తీశాడు. ఆ తర్వాత పలు కాలేజీ కథలూ వచ్చాయి. అయితే అందులో లేని సరికొత్త సంఘటనలు పాపా చిత్రంలో వున్నట్లు కనిపిస్తాయి. ఇందులో తెలిసిన సీనియర్ నటులు ఇద్దరుముగ్గురు భాగ్యరాజా, విటివి గణేష్ వంటి వారు అయినా మిగిలిన వారంతా కొత్తవారు వున్నా కనెక్ట్ అవుతారు. ప్రేక్షకులు ఆయా పాత్రలతో సహానుభూతి చెందుతారు.
హీరోగా నటించిన కవిన్, హీరోయిన్ పాత్ర పోషించిన అపర్ణాదాస్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తారు. వీళ్ళ అబ్బాయిగా చేసిన మాస్టర్ ఇయాన్ తోనూ మనం ప్రేమలో పడిపోతాం. ముఖ్యంగా క్లైమాక్స్ లో కంట తడి పెట్టని వారంటూ ఎవరూ ఉండరు. హృదయాల్ని మెలిపెట్టేసే పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. బరువెక్కిన గుండెలతో థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు... చాలా రోజుల తర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీ చూశామనే సంతృప్తికి లోనవుతారు. హీరోయిన్ అపర్ణాదాస్... కెరీర్ బిగినింగ్ నాటి నయనతారను కాస్త పోలి ఉండడం వల్ల... అట్లీ దర్శకత్వంలో ఆర్య - నయనతార నటించగా ఘన విజయం సాధించిన "రాజా - రాణి" చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే ఆ పోలిక జోనర్ కు మాత్రమే పరిమితం.
సాంకేతికంగా చూస్తే, ఛాయాగ్రహణం, సంగీతం కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే అనువాదం పరంగా తీసుకున్న జాగ్రత్తలు "పాపా" చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. డబ్బింగ్ చిత్రమనే విషయం తెలియకుండా... థియేటర్లకు వెళ్లి సినిమా చూసేవాళ్ళు... స్ట్రెయిట్ సినిమా చూస్తున్న అనుభూతిని పొందుతారు. సంభాషణలు కూడా చాలా చోట్ల ఆకట్టుకుంటాయి, కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి కూడా.
తెలుగు నేటివిటీ పరంగా కొంత ఎడిటింగ్ వుంటే బాగుంటుందనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ ను ఇంకొంచెం క్యాష్ చేసుకునెలా రెండుమూడు సీన్స్ కన్సీవ్ చేసుకుని ఉంటే ఎమోషన్ మరింత పండేదనిపిస్తుంది. "సింగిల్ పేరెంటింగ్"లో ఉండే పెయిన్, తండ్రీకొడుకుల మధ్య బాండింగ్ కు ఇంకొంచెం ప్రాధాన్యత ఇచ్చి ఉంటే కూడా ఇంకా బాగుండేదనిపిస్తుంది. అయితే... మనసు తడిని వెలికి తీసే క్లైమాక్స్... ఇటువంటి చిన్న చిన్న కంప్లైంట్స్ కు తావు లేకుండా చేస్తుంది. దర్శకుడి మీద గౌరవం పెంచేలా చేస్తుంది!!
ఈ చిత్రం చక్కటి ఫీల్ గుడ్ కలిగించేలా వుంటుంది. ఎన్నారై ప్రొడ్యూసర్ శ్రీమతి నీరజ కోట ఉత్తమాభిరుచికి ఈ చిత్రం అద్దం పడుతుంది. భిన్నమైన కథనంతో కూడిన ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.