Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Advertiesment
Narne Nithin-   Sri Sri Sri Rajavaru

దేవీ

, శుక్రవారం, 6 జూన్ 2025 (14:35 IST)
Narne Nithin- Sri Sri Sri Rajavaru
నార్నే నితిన్ హీరోగా "శతమానం భవతి" దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రం జూన్ 6న అనగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంపద హీరోయిన్ గా నటించగా, సీనియర్ నరేష్, రావురమేష్, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో  యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుందని ముందు చెప్పారు. అలాగే  అసలు ఈ కథకు శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే పేరు ఎందుకు పెట్టారనేది తెలుసుకోవాలంటే. ఈ సినిమా చూడాల్సిందే.
 
 
కథ:
గోదావరి జిల్లాలో పచ్చటి పొలాలు వున్న ఆత్రేయపురం అనే ఊరిలో సీనియర్ నరేశ్, రావురమేష్ మంచి స్నేహితులు. నరేష్ కు కొడుకు పుట్టి చలనం లేకపోవడంతో చనిపోయాడనుకున్న టైంలో సిగరెట్ పొగ తగిలి శ్వాస తీసుకుంటాడు. అతనే నార్నే నితిన్. రావురమేష్ కు  సంపద అనే కూతురు పుడుతుంది. పెళ్లీడు వచ్చేసరికి నితిన్, సంపద ప్రేమించుకుంటారు. కానీ సిగరెట్ మాత్రం మానలేకపోతాడు నితిన్.

ఇక ఊరిలో స్నేహితులైన ఎం.పి.టి.సి. పోస్ట్ కు నరేష్, రావురమేష్ పోటీపడుతుంటారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలవల్ల తనకు ఇష్టంలేకపోయినా పదవికోసం రావురమేష్.. నరేశ్ తో సంబంధం కలుపుకోవాలని చూస్తాడు. సరిగ్గా నిశ్చితార్థం రోజున సంపదకు తెచ్చిన ఉంగరం  విషయంలో చిన్న గొడవ చిలికిచిలికి పెద్దదై నిశ్చితార్థం ఆగిపోతుంది. ఆ తర్వాత ఏమి జరిగింది? అసలు నిశ్చితార్థం ఎందుకు ఆగింది? స్నేహితులైన నరేష్, రావు రమేష్ ల మధ్య ఏమి జరిగింది? అనేవి తెలుసుకోవాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.
 
సమీక్ష:
ఈ సినిమాలో నార్నే నితిన్ అనగానే క్రేజ్ వచ్చింది. అందులోనూ శతమానం భవతి" దర్శకులు సతీష్ వేగేశ్న పేరుతో ఓ మంచి కుటుంబకథా చిత్రంగా వస్తోందని ఫిక్స్ అయింది. తగినట్లుగానే గ్రామీణ అందాలు, గ్రామంలో వుండే వివిధ మనసుల తత్వం, చిన్నప్పుడు ఆడుకునే గోలీలాటలు, ఆప్యాయ పలుకరింపులు, వెటకారపు మాటలు కలబోసి మంచి వంటకంలా తయారుచేశాడు దర్శకుడు. దీనికి తగిన విత్తులువేసి ముందుకు నడిపిన నిర్మాత చింతపల్లి రామారావు. గతంలో కొన్ని మంచి సినిమాలు తీసి కొంత గేప్ తీసుకుని ఆమధ్యే ఓ సినిమాను కూడా రిలీజ్ చేశారు. ఇక  శ్రీ శ్రీ శ్రీ రాజావారు మాత్రం పక్కా ఫీల్ గుడ్ సినిమా తీశారనే చెప్పాలి.
 
నార్నే నితిన్ మొదట్లో చేసిన సినిమాగనుక నేచురల్ లుక్ తో వున్నాడు. నటన, యాక్షన్ కూడా మురిపించాడు. సంపద పాత్ర అచ్చమైన ఆరణాల తెలుగు అమ్మాయిగా కనిపించింది. నితిన్ స్నేహితులుగా వున్నవారితో ఎంటర్ టైన్ మెంట్ చూడొచ్చు అసలు గ్రామంలో వుండే ప్రతిపాత్రలోనూ వినోదం దాగి వుంది. దాన్ని దర్శకుడు అలా మలిచాడనే చెప్పాలి.
 
నితిన్, సంపద ప్రేమ మధ్య జరిగే సన్నివేశాలు సహజంగా వున్నాయి. ఇరు కుటుంబాల్లో మగవారిలో వుంటే పట్టు, ఇగోలు బాగా చూపించగలిగారు. సన్నివేశపరంగా  టీవీ చూపిస్తూ సాగే సంభాషణలు కూడా కథను నడిపాయి. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా దర్శక నిర్మాతలు జాగ్రత్త తీసుకున్నారు. ఇతర పాత్రలు పరిధిమేరకు నటించాయి.  మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఓ పెద్ద సినిమాకున్న కథ ఇందులో వుంది. అయితే ఇది మలయాళ చిత్రానికి రీమేక్ అనిపించినా మన నేటివిటీకి మలచడం గొప్ప విషయం.
 
సినిమాటోగ్రపీ హైలైట్ అని చెప్పాలి. సన్నివేశపరంగా సంభాషణలు, మాటల విరుపులు బాగున్నాయి. ఇల్లరికం అల్లుడులా ఇద్దరు అల్లుళ్ళు నరేశ్ కు వుండడం అనే కాన్పెస్ట్ప్ లో ఎంటర్ లైన్ వుంది.  శ్రీ శ్రీ రాజావారు విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.  నితిన్ ఖాతాలో ఆయ్ , మ్యాడ్ తరహాలో విజయవంతమైన ఆహ్లాదకరమైన సినిమా అని చెప్పవచ్చు.
 
ఇ.వి.వి. గారి దగ్గర పనిచేసిన అనుభవం ఈ సినిమాకు దర్శకుడిలో కనిపించింది. ఎక్కడా వల్గారిటీ లేకుండా హాయిగా అచ్చమైన తెలుగు సినిమా చూశామనే ఫీలింగ్ కలిగింది. ఈ మధ్య రణగొనధ్వనులు, హింస ఎక్కువగా వస్తున్న సినిమాలకు కాస్త రిలీఫ్ గా ఈ సినిమా వుంటుందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. కథ అనేది కొత్తదికాకపోయినా మంచి సినిమా చూశామనే పీల్  ప్రేక్షకుడికి కలుగుతుంది.
రేటింగ్: 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన