Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాప్సి దెయ్యం పాత్రను మింగేసిన కమేడియన్లు (మూవీ రివ్యూ)

ఇటీవల ప్రేక్షకుల్ని దెయ్యం, భూతం అంటూ భయపెట్టే కథలు వెండితెరపై వరసగా వచ్చేస్తున్నాయి. మినిమం గ్యారంటీగా దర్శకనిర్మాతలు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నేడు విడుదలైన 'ఆనందో బ్రహ్మ'లో తాప్సీ నటించడం ప్రత్యేకత అయితే.. దెయ్యాలే మనుషుల్ని చూసి భయపడటమనేది ర

తాప్సి దెయ్యం పాత్రను మింగేసిన కమేడియన్లు (మూవీ రివ్యూ)
, శుక్రవారం, 18 ఆగస్టు 2017 (18:01 IST)
నటీనటులు:  తాప్సీ, శ్రీనివాసరెడ్డి, శకలక శంకర్‌, వెన్నెల కిశోర్‌, తాగుబోతు రమేష్‌, రాజీవ్‌ కనకాల, రాజా రవీంద్ర, విజయ్‌చందర్‌, పోసాని, తనికెళ్ళ భరణి, విద్యులేఖ రామన్‌, అదుర్స్‌ రఘు, ప్రభాస్‌ శీను తదితరులు. నిర్మాతలు: విజయ్‌ చిల్లా, సతీష్‌ దేవిరెడ్డి, సంగీతం: కె, దర్శకత్వం: మహి వి. రాఘవ్‌.
 
ఇటీవల ప్రేక్షకుల్ని దెయ్యం, భూతం అంటూ భయపెట్టే కథలు వెండితెరపై వరసగా వచ్చేస్తున్నాయి. మినిమం గ్యారంటీగా దర్శకనిర్మాతలు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నేడు విడుదలైన 'ఆనందో బ్రహ్మ'లో తాప్సీ నటించడం ప్రత్యేకత అయితే.. దెయ్యాలే మనుషుల్ని చూసి భయపడటమనేది రివర్స్‌ కాన్సెప్ట్‌. దీన్ని గతంలో 'పాఠశాల' చిత్రానికి దర్శకత్వం వహించిన మహి దర్శకత్వం వహించారు. అదెలా వుందో చూద్దాం.
 
కథ:
మలేషియాలో వుండే రాము (రాజీవ్‌ కనకాల) ఇండియాలో వున్న తన ఇల్లును అమ్మకానికి పెడతాడు. ఈ విషయంలో పోలీసైన స్నేహితుడు రావు రమేష్‌ సాయం కోరతాడు. అయితే పది కోట్లు విలువ చేసే ఆ ఇంటిలో దెయ్యాలున్నాయనే భయంతో కోటి వరకే ఇస్తానని ఓ బార్‌ యజమాని చెప్పడంతో వెనకడుగు వేస్తాడు. ఈ విషయం తెలిసిన అక్కడ వెయిటర్‌ సిద్దు (శ్రీనివాసరెడ్డి) తనకు అవకాశం ఇస్తే మంచి రేటు ఇచ్చే పార్టీని తీసుకువస్తానని అభ్యర్థిస్తాడు. అందుకు మంచి కమీషన్‌ వస్తుందనే ఆశతో రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ అవి బెడిసి కొట్టడంతో ఏకంగా తనే ఆ ఇంటిలో నాలుగు రోజులుండి దెయ్యాలు లేవని నిరూపిస్తానని సిద్ధు ప్రవేశిస్తాడు. ఇందుకు తనలాగే డబ్బు అవసరమున్న ప్లూట్‌ రాజు (వెన్నెల కిశోర్‌), తులసి (తాగుబోతు రమేష్‌), సెలూన్‌ బాబు (షకలక శంకర్‌)లతో ఆ ఇంటిలోకి వెళ్తారు. ఆ తర్వాత ఆ దెయ్యాలు వీరిని ఏం చేశాయి? అందుకు వీరేం చేశారు? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
హార్రర్‌ చిత్రాల్లో ఎక్కువగా ఉండే కాన్సెప్ట్‌ కోరికలు తీరక చనిపోయిన వారు ఆత్మలుగా అక్కడే తిరుగుతుండడం. ఇలాంటి కథే అయినా... నాలుగు ఆత్మలైన తాప్సీ, విజయ్‌చందర్‌, రఘు, బాలనటి.. వీరంతా తామెందుకు చనిపోయామో కూడా తెలియదు. తామెలా చనిపోయామో తెలియాలంటే.. ఇంటినుంచి వెళ్ళిపోయిన ఇల్లాలు కన్పిస్తేనే సమస్యకు పరిష్కారం. అప్పటివరకు ఆ ఇంటిలోనే ఉంటూ ఇల్లు కొనుక్కోవడానికి వచ్చినవారికి చుక్కలు చూపిస్తుంటాయి. 
 
అందుకే.. బతుకుమీద ఆశలు వదులుకున్న ముగ్గురు వ్యక్తుల్ని సిద్ధు తీసుకువచ్చి అక్కడేం చేశాడనేది దర్శకుడు ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. మొదటిభాగంలో పెద్దగా కథ కనబడదు. ఆకట్టుకునే సన్నివేశాలు వుండవు. సెకండాఫ్‌ సాగే క్రమంలో వచ్చే పాత్రలు, దెయ్యాలు చేసే విన్యాసాలు కాస్త నవ్విస్తాయి. శ్రీనివాసరెడ్డి గతంలో గీతాంజలి చేసినా.. ఇందులో కొత్తగా చేసే ప్రయత్నం చేశాడు. వీరి బ్యాచ్‌లో బాగా ఎంటర్‌టైన్‌ చేసింది షకలక శంకర్‌. క్షురక వృత్తి చేసే శంకర్‌కు ఎప్పటికైనా హీరో అవ్వాలనే గోల్‌. దాన్ని తనికెళ్ళ భరణి క్యాష్‌ చేసుకునే విధానం పాత ఫార్మెట్‌. ఇక దెయ్యం వున్న ఇంటిలోకి ప్రవేశించాక శంకర్‌ చేసే రకరకాల విన్యాసాలు తనలోని నటుడ్ని పైకి తెచ్చాయి. గత చిత్రాల్లో నటుడిగా నిరూపించుకున్నా ఈ చిత్రం అతని కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుంది. మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. కన్నవారిని చంపే కొడుకుగా రాజీవ్‌ కనకాల నటించాడు.
 
హార్రర్‌ నేపథ్యాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ చూపించే ప్రయత్నం దర్శకుడు చేశాడు. అందుకు తను రాసుకున్న సన్నివేశాలు కొత్తగా ఏం లేకపోయినా పాత్రల ద్వారా మెప్పించే ప్రయత్నం చేశాడు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది. ఏదో కొత్త ప్రయోగం చేయాలనిపించి చేసిన తాప్సీ పాత్రను కమేడియన్లు మింగేశారు. దెయ్యాలు మనుషుల్ని చూసి భయపడడం ఏమిటనే ఆసక్తి మినహా అందుకు తగిన బలమైన కారణాలు ఇందులో లేకపోవడం చిన్న లోపం. చిన్నపాటి లోపాలు మినహాయిస్తే మాస్‌ప్రేక్షకుల్ని కాసేపు ఎంటర్‌టైన్‌ చేసే సినిమాగా నిలుస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్‌‌ కంటే ప్రభాస్‌కు జీతమెక్కువా? ఆ రికార్డును బాహుబలి బ్రేక్ చేస్తాడా?