Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాకింగయ్యా చంద్రం... కొత్త జీఎస్టీ... కొత్త బాదుడూ....

ఇదివరకు మనం ఓ ప్రకటన చూస్తుండేవాళ్లం. అందులో " అదిరిందయ్యా చంద్రం... కొత్త ఇల్లూ.. కొత్త భార్యా.." అంటూ ఆ యజమాని చాలా హ్యాపీగా వున్నాడని తెలియజేసేది ఆ ప్రకటన. ఇప్పుడిది పూర్తిగా రివర్సయ్యేట్లుగా వుంది. బ్యాంకులో డబ్బు తీస్తే బాదుడు... క్రెడిట్ కార్డు

Advertiesment
GST effects
, శుక్రవారం, 30 జూన్ 2017 (21:14 IST)
ఇదివరకు మనం ఓ ప్రకటన చూస్తుండేవాళ్లం. అందులో " అదిరిందయ్యా చంద్రం... కొత్త ఇల్లూ.. కొత్త భార్యా.." అంటూ ఆ యజమాని చాలా హ్యాపీగా వున్నాడని తెలియజేసేది ఆ ప్రకటన. ఇప్పుడిది పూర్తిగా రివర్సయ్యేట్లుగా వుంది. బ్యాంకులో డబ్బు తీస్తే బాదుడు... క్రెడిట్ కార్డుతో వస్తువు కొంటే బాదుడు... హోటల్‌కు వెళితే బాదుడు... సినిమా చూస్తే బాదుడు... ఇలా ఏం చేసినా ట్యాక్స్ బాదుడే బాదుడు. కొత్త జిఎస్టీతో సామాన్యుడికి మేలు జరుగుతుందని చెపుతున్నా చాలామటుకు వారి నడ్డి విరగడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాలు షికార్లు, హోటళ్లు... ఎలక్ట్రిక్ పరికరాలను పట్టుకుంటే జీఎస్టీ రూపంలో షాక్ కొడుతుంది. 
 
సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు ఎవరయినా కష్టపడి ఓ అపార్టుమెంటు కొనాలని చూస్తే వారికి వాత పడటం ఖాయం. ఉదాహరణకు 25 లక్షల రూపాయలతో ఓ అపార్టుమెంట్ కొనేవారు లక్షన్నర రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. ఇలా తెలియకుండానే జీఎస్టీ మెత్తటి వాతలు పెడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 332 రకాల వస్తువుల్లో సగానికి పైగా వస్తువులపై జీఎస్టీ బాదుడు వుంటుందని అంటున్నారు. 
 
చేనేత రంగంపై భారం మరింత పడనుంది. ఈ పన్ను నూలుపై 5 శాతం వుండగా అది దుస్తులుగా మారాక మరో 5 శాతం పడుతుంది. దీనితో చేనేత పరిశ్రమ మరింత సంక్షోభంలో కూరుకుపోతుంది. రూ. 20 లక్షల దాటిన వారు మాత్రమే వ్యాపారం చేయాలి. అంతేకాదు... నెలకు 3 సార్లు రిటర్న్స్ చేయాలి, లేదంటే కొరడా ఝుళిపిస్తారు. ఇక ఔషధ రంగం గందరగోళంలో పడింది. దీనిపై 40 శాతం పన్ను పెరగబోతోంది. ఈ పెరిగే పన్ను ఎవరు భరిస్తారన్న దానిపై స్పష్టత లేదు. 
 
ఎటొచ్చీ జీఎస్టీతో మందులు ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా ఈ ప్రభావం రిటైల్ వ్యాపారులపై వుంటోంది. అందువల్ల వారు తమ వద్ద పెద్దమొత్తంలో స్టాకును పెట్టుకునేందుకు సిద్ధంగా వుండటంలేదు. దానితో సామాన్యులకు ఎమర్జెన్సీ మందులు కావాలంటే పరిస్థితి అగమ్యగోచరమే. ఈ గందరగోళం ఏ పరిస్థితికి దారితీస్తుందో పన్ను అమలయ్యాక కాని తెలియదు. ఇక సినిమా చూడాలనుకునేవారి పెద్ద సినిమా జీఎస్టీ రూపంలో కనబడుతుంది.
 
సినిమా టిక్కెట్ల ధరలు పెరిగిపోవచ్చు. మల్టీప్లెక్సుల్లో అమ్మె పదార్థాలు చెట్టెక్కి కూర్చోవచ్చు. మొత్తమ్మీద చూస్తే నెలకు కాదు కానీ ఏ ఆరు నెలలకో సంవత్సరానికో కొంత డబ్బును కూడబెట్టుకుని సినిమా చూడాల్సి రావచ్చేమో. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి మీద పడేట్లుగా వుంది. జీఎస్టీతో తెలంగాణ రాష్ట్రానికి రాబడి భారీగా కోత పడుతుంది. సుమారు 59 వేల కోట్ల మేర రాబడి తరిగిపోయి సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల నిర్మాణంపైన దాని ప్రభావం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడికి గండి పడినా ప్రతి ఏటా కేంద్రం ఇచ్చే 59 వేల కోట్ల రూపాయలతో కొంతమేర ఒడ్డున పడుతుంది. ఐతే కొత్త కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటే మాత్రం ఒకటికి నాలుగుసార్లు ఆలోచన చేసుకునే పరిస్థితి అయితే వుంటుందంటున్నారు. బలమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలున్న మన దేశంలో ఒకే పన్ను చట్టంతో 70 శాతం వ్యవసాయంపై ఆధారపడే ప్రజలున్న భారతదేశంలో ఈ ఫార్ములా ఏమేరకు ఫలితాలు ఇస్తుందో చూడాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"దోమల ఉత్పత్తి నివారణ చట్టం"పై మంత్రులు కామినేని, లోకేష్ సమావేశం