అమర్‌నాథ్ యాత్రికులపై దాడి.. లష్కరే తోయిబా పనే.. కాశ్మీర్ ఐజీ
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. రాత్రి 8.20గంటల ప్రాంతంలో అనంత్‌నాగ్‌కు సమీపంలోని బటంగూ ప్రాంతంలోని పోలీసులకు సంబంధ
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. రాత్రి 8.20గంటల ప్రాంతంలో అనంత్‌నాగ్‌కు సమీపంలోని బటంగూ ప్రాంతంలోని పోలీసులకు సంబంధించిన ఓ వాహనంపై ఉగ్రవాదులు తొలుత కాల్పులు జరిపారు. పోలీసులు ప్రతిఘటించి ఎదురుకాల్పులకు పాల్పడటంతో ముష్కరులు మరింత రెచ్చిపోయారు.
అదే సమయంలో హైవేపైకి వచ్చిన అమర్‌నాథ్ యాత్రికులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు యాత్రికులు మృతి చెందారు. మరో 11 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రికులకు పటిష్ఠ భద్రత ఏర్పాటుచేశారు. కాగా పవిత్ర అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపింది లష్కరే తోయిబా ఉగ్రవాదులని కశ్మీర్ ఐజీ మునీర్ ఖాన్ తెలిపారు. ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారి పాక్‌కు చెందిన ఉగ్రవాది ఇస్మాయిల్‌గా పేర్కొన్నారు.
పోలీసు చెక్ పోస్టుకు కేవలం 600 మీటర్ల దూరంలో యాత్రికుల బస్సును మూడు వైపుల నుంచి చుట్టు ముట్టిన ముష్కరులు విచక్షణా రహితంగా కాల్పులకు దిగారని.. కాల్పులు జరిపిన తరువాత ఉగ్రవాదులు పారిపోగా, వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని మునీర్ ఖాన్ తెలిపారు. ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.
ఈ ఘటనపై స్పందించిన కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, ఈ దాడితో ప్రతి కాశ్మీరీ సిగ్గుతో తల దించుకునే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. మాటలకందని బాధ తనలో కలిగిందని, ఈ తరహా దాడులతో దేశాన్ని దెబ్బతీయలేరని అన్నారు.
మరోవైపు పవిత్ర అమర్‌నాథ్‌యాత్ర లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేసి ఏడుగురు యాత్రికులను బలితీసుకున్న ఘటనపై సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోవల్, హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు, నిఘా విభాగం, పారామిలటరీ బలగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి, అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడి ఘటనలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాత్రికులకు మరింత భద్రతను పెంచే చర్యలపై సమీక్షించారు.