Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్‌గోపాల్‌ వర్మ చిత్రం ‘దహనం’ను ప్రసారం చేయనున్నట్లు వెల్లడించిన ఎంఎక్స్‌ ప్లేయర్‌

Advertiesment
Varma
, మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (16:27 IST)
ఎముకలలో సైతం వణుకు పుట్టించేలా  యాక్షన్‌ థ్రిల్లర్‌లను రూపొందించడంలో సుప్రసిద్ధులైన దర్శకుడు, నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ మరోమారు పూర్తి యాక్షన్‌ కథాంశంతో వెబ్‌ ఇసిరీస్‌ ద్వారా తిరిగి వచ్చారు. ‘దహనం’ పేరిట ఏడు ఎపిసోడ్ల సిరీస్‌గా ఏప్రిల్‌ 14,2022 నుంచి ప్రేక్షకుల ముందుకు ఎంఎక్స్‌ ప్లేయర్‌ తీసుకురానుంది. రామ్‌గోపాల్‌ వర్మ, అభిషేక్‌ దుహన్‌, నైనా గంగూలీ, అభిలాష్‌ చౌదరి మరియు అగస్త్య మంజులు నేడు ఈ సిరీస్‌ విడుదల గురించి వెల్లడించడానికి హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 
గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ వెబ్‌సిరీస్‌ ఓ కమ్యూనిస్ట్‌ నేత రాములును హత్య చేయడంతో ప్రారంభమవుతుంది. శ్రీరాములు కొడుకు హరి, ఓ విప్లవకారుడు. అడవిలో ఉండి గొరిల్లా తరహా పోరాటాన్ని  భూస్వాములతో చేస్తుంటాడు. అతను తన తండ్రి మరణ వార్త విని ఆవేశంతో రగిలిపోతాడు. అక్కడి నుంచి ఆ గ్రామంలోని బలవంతులైన గుండాలకు, అతనికి జరిగే పోరాటం ఆసక్తి రేకెత్తిస్తుంది. తన తండ్రి మరణానికి కారకులైన వారిని కనిపెట్టడంతో పాటుగా వారిపై జరిపే పోరాటం ఈ సిరీస్‌ను ఆసక్తి కరంగా మలుస్తుంది.

 
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ షో గురించి రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ, ‘‘నా మొట్టమొదటి ఓటీటీ సిరీస్‌ ‘దహనం’ను ఎంఎక్స్‌ ప్లేయర్‌ భాగస్వామ్యంతో రూపొందించి హైదరాబాద్‌లో విడుదల చేయడం పట్ల సంతోషంగా ఉన్నాను. ఈ కథనం రెండు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు నడుమ దాగిన చీకటి కోణాన్ని స్పృశిస్తుంది. అవేమిటంటే, ‘కంటికి కన్ను అని అనుకుంటూ వెళ్తే ప్రపంచాన్ని గుడ్డిగా మార్చడంలో మాత్రమే మనం విజయం సాధించగలమ’ని మహాత్మాగాంధీ చెబుతారు. కానీ మహాభారతంలో మాత్రం ‘ప్రతీకారం అనేది పూర్తిగా స్వచ్ఛమైన ఓ భావోద్వేగం’ అని చెబుతుంది. ‘దహనం’ వెబ్‌ సిరీస్‌లో కేవలం ప్రతీకారం గురించి మాత్రమే వెల్లడించడం కాదు, ఆ ప్రతీకార పర్యవసానాలు కూడా చర్చించాము.
 
ఇది క్రైమ్‌ థ్రిల్లర్‌ కాదు, కానీ థ్రిల్లింగ్‌ క్రైమ్స్‌తో కూడినది. ఊపిరిబిగపట్టి చూసేలా వీటిని తీర్చిదిద్దడం జరిగింది. ఈ షోతో మేము కేవలం ఓ అడుగు ముందుకేయడం కాదు, కథ డిమాండ్‌ చేసిన తీరుతో తమ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసిన నటీనటుల అద్భుత నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నో మైళ్ల దూరం వెళ్లగలిగాం. ప్రేక్షకుల స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి మా మొత్తం బృందం ఆసక్తిగా ఎదురుచూస్తోంది’’ అని అన్నారు.

 
నటి నైనా గంగూలీ మాట్లాడుతూ, ‘‘రామ్‌గోపాల్‌ వర్మ గారితో కలిసి పనిచేయడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఆయన బోధనలు ఎప్పుడూ మనకెంతగానో తోడ్పడతాయి. నా మెంటార్‌తో మరింత సన్నిహితంగా చేసే  అవకాశాన్ని దహనం అందించింది. దహనంలో నేను చేసిన క్యారెక్టర్‌ పూర్తి సవాల్‌తో కూడినది. ప్రేక్షకుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు.

 
నటుడు అభిషేక్‌ దుహాన్‌ మాట్లాడుతూ, ‘‘నా క్యారెక్టర్‌ ఈ సిరీస్‌లో రాములు కొడుకు హరి. ఓ విప్లవకారుడు (నక్సలైట్‌)గా చేశాను. తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకునే పాత్ర. కేవలం ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే కాదు, తమకు మద్దతు లభించని ఎంతోమందికి తగిన మద్దతునూ అందిస్తుంటాడు. ఈ మొత్తం ప్రయాణం అత్యంత అందమైన అనుభవం అని మాత్రం నేను చెప్పగలను. ఈ క్యారెక్టర్‌ గురించి ప్రేక్షకుల స్పందన ఏమిటనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ సిరీస్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన మా బృందంలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను’’ అని అన్నారు.

 
నటుడు అభిలాష్‌ చౌదరి మాట్లాడుతూ, ‘‘దహనం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. గతంలో కూడా నేను ఆర్‌జీవీ గారి ప్రాజెక్ట్‌లలో పనిచేశాను. ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఓ అభ్యాసమే. ఈ దహనం  సిరీస్‌ విడుదల, ప్రేక్షకుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు.

 
తన  తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తపిస్తున్న ఓ కొడుకు కథ దహనం. ప్రతీకారం, రక్తపాతం, హింస నేపథ్యంలో ‘దహనం’ పేరిట ఏడు ఎపిసోడ్ల సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు ఎంఎక్స్‌ ప్లేయర్‌ తీసుకురానుంది. రామ్‌గోపాల్‌ వర్మ నిర్మాణంలో అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఇషా కొప్పికర్‌, అభిషేక్‌ దుహన్‌, నైనా గంగూలీ, అశ్వత్‌కాంత్‌ శర్మ, అభిలాష్‌ చౌదరి, పార్వతి అరుణ్‌, సయాజీ షిండే మరియు ప్రదీప్‌ రావత్‌లు అత్యంత కీలకమైన పాత్రలలో నటించారు. తెలుగులో రూపొందించిన ఈ సిరీస్‌ను హిందీ, తమిళ భాషలలో డబ్బింగ్‌ చేయనున్నారు. అత్యంత ఆసక్తి కలిగించే ఈ డ్రామాకు సంబంధించిన ఎపిసోడ్లు అన్నీ కూడా ఎంఎక్స్‌ ప్లేయర్‌ వద్ద 14 ఏప్రిల్‌ 2022 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం కానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ విష్ణు న‌టించిన‌ అల్లూరి ప్రీ లుక్ విడుద‌ల చేసిన‌ రవితేజ