ఆకెళ్ల పేరుతో పలు సినిమాలకు రచయితగా పని చేసిన ఆకెళ్ల సూర్యనారాయణ ఇకలేరు. 75 ఏళ్ల ఆకెళ్ల సూర్యనారాయణ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించి గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 80కి పైగా తెలుగు సినిమాలకు మంచి కథలను, మాటలను అందించిన ఆకెళ్ల 15 ఏళ్ల పాటు తెలుగు రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ఆకెళ్ళ కథలు ఎక్కువగా మహిళల జీవితానికి సంబంధించిన అంశాలు ఇతివృత్తంగా నడుస్తాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో జానకీ, రామయ్య దంపతులకు ఆకెళ్ల సూర్యనారాయణ జన్మించారు. చిన్నతనం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించారు. 1960లో బాలరాముడి పాత్రతో నాటకరంగంలోకి అడుగుపెట్టారు. మొదటగా చందమామ, బాలమిత్ర పత్రికలకు కథలు వ్రాసి పంపించడం మొదలుపెట్టారు. డిగ్రీ పూర్తయిన తర్వాత తన మొదటి నవల రచించారు. వీరు సుమారు 200 కథలు, 20 నవలలను రచించారు. వీనిలో కొన్ని ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్దాయి. టీవీ సీరియల్స్‌కి దాదాపుగా 800 ఎపిసోడ్స్ రాశారు.
సాంఘిక నాటికలు, పిల్లల నాటికలు, పద్య నాటకాలు, రేడియో నాటకాలు ఇలా అన్ని విభాగాల్లో రచన చేశారు. 1997లో తొలిసారిగా కాకి ఎంగిలి అనే నాటకాన్ని రాశాడు. తరువాత అల్లసాని పెద్దన, రాణి రుద్రమ, రాణాప్రతాప్ లాంటి చారిత్రక నాటకాలు రాశారు.
ఆకెళ్ల రచయితగా పని చేసిన తొలి చిత్రం మగమహారాజు. తర్వాత స్వాతిముత్యం, శ్రుతిలయలు, ఆడదే ఆధారం, సిరివెన్నెల, శ్రీమతి ఒక బహుమతి, నాగదేవత, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఓ భార్య కథ, ఆయనకి ఇద్దరు, చిలకపచ్చ కాపురం, ఔనన్నా కాదన్నా, ఎంత బావుందో చిత్రాలకు రచయితగా పని చేశారు.
అంతేకాకుండా అయ్యయ్యో బ్రహ్మయ్య చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఆకెళ్ల సూర్యనారాయణకు ఎన్నో అవార్డులు కూడా లభించాయి. విశాలాంధ్ర అవార్డు, ఆంధ్రప్రభ అవార్డు, యువ చక్రపాణి అవార్డు, విజయ మాస పత్రిక అవార్డు, కాకి ఎంగిలి నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. అలాగే 13 సార్లు ఉత్తమ రచయితగా నంది అవార్డును అందుకోవడం విశేషం.
ఆకెళ్ల సూర్యనారాయణకు ఐదుగురు సంతానం. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆకెళ్ల అంత్యక్రియలు శనివారం ఉదయం 10.30లకు హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆకెళ్ల మృతి పట్ల ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.