మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు గత రెండు పర్యాయాలు నుంచి సభ్యులకు చేసింది పెద్దగా ఏమీ లేదని సన్నిహిత వర్గాలే తెలియజేస్తున్నాయి. 2019కు ముందు శివాజీరాజా, జయసుధ వంటివారు మా అధ్యక్షులుగా వున్నారు. ఆ తర్వాత శివాజీరాజా పనితీరుపై సభ్యులు పలువురు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీనియర్ నరేశ్ రంగంలోకి దిగారు. అప్పటికే అతని తల్లి విజయనిర్మల `మా` సభ్యులకు తన పుట్టినరోజు సందర్భంగా ఎన్ని సంవత్సరాలయితే అంత మొత్తాన్ని మా కు సహాయనిధి కింద అందజేసేది. ఇక తర్వాత నరేశ్‌కు గట్టిపోటీనే ఏర్పడింది. ఆ తర్వాత ఆ పేనల్‌లో కార్యదర్శిగా జీవితా రాజశేఖర్ ఎన్నికయ్యారు. అప్పట్లో ఆ పేనల్‌కు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ అండగా నిలిచింది. ప్రత్యేకంగా నాగబాబు ఈ పేనల్ కే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దాంతో శివాజీరాజా పేనల్ ఓడిపోయింది.
నరేశ్ ఆఫీసుకు ఎందుకు రాలేదు
ఇక ప్రస్తుతానికి వస్తే నరేశ్ మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన ఆఫీసుకు రావడం చాలా అరుదుగా జరుగుతుందనేది అందరికీ తెలిసిందే. దానికి కారణం ఆయన నటుడిగా బిజీ కావడంతోపాటు కొన్ని సమస్యలు కూడా శివాజీరాజా నుంచి వచ్చినవే. చెక్‌పై సంతకాలు చేసే విధానంలో శివాజీ రాజా తనకూ కొంత కాలం హక్కువుందని వాదించడం, రూల్ ప్రకారం నేను సంతకాలు చేయాలి అనడంతో అది పెద్ద చర్చకు తావిచ్చింది. దాంతో నరేశ్ ఆఫీసుకు రావడం మానేసినట్లు సన్నిహితులు చెబుతుండేవారు. ఇక ఆ తర్వాత నరేశ్ ఆధ్వర్యంలో పేద కళాకారులకు ఫించన్ ఇవ్వాలనే క్రమంలో అందరినీ స్టడీచేసి ఓ టీమ్‌ను ఏర్పాటు చేసి అర్హులైన వారికి అందజేయాలని చూశారు. కానీ ఆ తర్వాత మా గొడవల వల్ల అది కొండెక్కింది. ఆ తర్వాత కరోనా ప్రభావంతోనే మా కార్యాలయం కొంత కాలం మూతపడింది. ఇప్పుడు మళ్ళీ సర్దుకున్నాక ఎన్నికల అజెండా ముందుకు వచ్చింది.
ఇక వర్తమానికి వచ్చే సరికి `మా` అధ్యక్షునిగా ప్రకాష్ రాజ్, మంచు విష్ను పోటీలో వున్నారు. వీరిద్దరిలో ప్రకాష్‌రాజ్‌కు మెగాస్టార్ చిరంజీవి భరోసా వుందనేది మా సభ్యుల మాట. ఎవరు గెలవాలన్నా మెగాస్టార్ కుటుంబం సపోస్ట్ వుంటేనే సాధ్యపడుతుంది. అయితే మంచు మోహన్‌బాబు మాత్రం సైలెంట్‌గా తన కొడుకు కోసం అందరినీ సంప్రదింపులు జరుపుతున్నాడు. ఆ భాగంలోనే సూపర్ స్టార్ కృష్ణను నిన్ననే కలిశారు.
ప్రకాష్‌రాజ్‌పై విర్శలు
అయితే ప్రకాష్‌రాజ్‌పై గతంలో రెండు పర్యాయాలు నిర్మాతలు ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. అతను టైంకు సరిగ్గా షూటింగ్ రాకపోవడంతోపాటు, డేట్స్ ను కూడా చివరి నిముషంలో వాయిదా వేసేవాడనీ, అందుకోసం కొందరు నిర్మాతలు ఛాంబర్ దగ్గర ధర్నాకు కూడా దిగారు. ఆ తర్వాత కొందరు పెద్దల సంప్రదింపులతో అది పరిష్కారమైంది. మరి అలంటి పెద్దల సపోర్ట్ ప్రకాష్‌రాజ్ కు వుంటే ఆయన తప్పక గెలుస్తాడు. కానీ ఇక్కడ ప్రకాష్‌రాజ్ జన్మస్థలం చర్చకు రావచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే విష్ణుకు అవకాశం వుంటుందనేది మరో వాదన.
అప్పుడు మంచు విష్ణు కూడా పదవిలోవున్నాడు
కానీ మంచు విష్ణు అనుభవం తక్కువ. అతను ఇప్పటి నరేశ్ పేనల్లో కూడా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు వ్యవహరించారు. కానీ ఆ తర్వాత ఏ మాత్రం ఆయన పానేల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నలేదనేది సమాచారం. పైగా ఆయన పెద్దల ముందు ఆనకపోవచ్చని సభ్యులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు వీరందరికంటే మోహన్‌బాబు నిలబడితేనే ఈ పదవికి సరైన న్యాయం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం. ఎలాగూ మోహన్‌బాబుకు పెద్దగా సినిమాలు లేవు కాబట్టి ఆయనే మా కు న్యాయం చేయగలడని కింది స్థాయి సభ్యులు తెలియజేయడం విశేషం. అందుకే మెగా ఫ్యామిలీ ఏదైనా స్టేట్ మెంట్ ఇస్తేనే `మా` ఎన్నిక ఒక కొలిక్కి వస్తుంది.