కరోనా వైరస్ కబంధ హస్తాల్లో జీవనపోరాటం చేస్తున్న సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్.పి. సుబ్రహ్మమణ్యం త్వరలోనే తిరిగివస్తారని సినీ నటి, రాజకీయ నేత విజయశాంతి ఆకాంక్షించారు. బాలు కోసం ప్రతి ఒక్కరూ పడుతున్న మనోవేదన, మనందరి సంకల్పం ఊరికేపోదని ఆమె చెప్పుకొచ్చారు. బాలు తిరిగి రావాలని కోరుతూ ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
'తన 54 సంవత్సరాల కళా ప్రస్థానంలో సాధించుకున్న అశేషమైన అభిమానుల ప్రేమ, పూజల కారణంగా బాలూ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని విశ్వసిస్తున్నాను. దక్షిణాది సినిమా పాటలకు ఎస్పీబీ ఓ బ్రాండ్ నేమ్ అనడం అతిశయోక్తి కాదు. డ్యాన్స్ రానివారితో కూడా స్టెప్స్ వేయించే శక్తి, మ్యూజిక్ తెలియనివారితో కనీసం హమ్మింగ్ చేయించే పవర్ బాలు పాటకు ఉంది. కనీసం రెండు తరాల జీవితాలు బాలూ గారి పాటతో పెనవేసుకుని ఉంటాయి. ఒక తరం పూర్తిగా బాలూగారి పాటలు వింటూ పెరిగింది.
ఇక, టీవీ షోల ద్వారా ఎందరో గాయనీగాయకులను బాలూగారు ప్రోత్సహించారు. వారు సినీ రంగంలో నిలదొక్కుకుకునేందుకు ఊతమిచ్చారు. పాటే కాదు, భావితరాలకు వినయం, విధేయత వంటి సుగుణాలను కూడా తన ప్రవర్తన ద్వారా బాలూగారు తెలియజెప్పారు. ఇవాళ వాళ్లందరూ బాలూ గారి పాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మన తెలుగువారే కాదు తమిళం, కన్నడం, మలయాళం, ఉత్తరాది రాష్ట్రాల అభిమానులు కూడా ఎస్పీబీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత మంది సంకల్పం ఊరికే పోదు. ఖచ్చితంగా మళ్లీ బాలుగారు మనకోసం పాడేలా చేస్తుంది` అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
కాగా, కరోనా వైరస్ సోకి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం విషమంగా మారిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఎక్మో సపోర్టుతో ప్రత్యేక ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలు క్షేమంగా తిరిగి రావాలని దేశం మొత్తం ప్రార్థనలు చేస్తోంది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. బాలు ఆరోగ్యంగా తిరిగి రావాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కోరుకుంటున్నారు. సీనియర్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు విజయశాంతి కూడా బాలు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.