దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టు మూవీ ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో తెలంగాణ గోండు వీరుడు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుంటే, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం మేరకు పూర్తయింది. ఇంతలోనే కరోనా వైరస్ కమ్మేయడంతో మిగిలిన షూటింగ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ చిత్రంలో నటించే వారంతా ఇపుడు తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు.
ఇంతవరకు బాగానే వున్న.. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల విషయంలోనే ఓ క్లారిటీ రానంటుంది. రామ్ చరణ్ జోడీగా నటించాల్సిన ఆలియా భట్ విషయంలో సమస్య వచ్చిందట. ఆమె తదుపరి చేయాల్సిన సినిమాలకు డేట్స్ క్లాష్ వచ్చేలా ఉండటంతో 'ఆర్ఆర్ఆర్' నుంచి తప్పుకుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఆలియా స్థానంలో మరో బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోవాలనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలపై జక్కన్న అండ్ టీమ్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ఇప్పటికే ఆరంభంలోనే బ్రిటన్ నటి ఎడ్గర్ జోన్స్ తప్పుకోగా, ఆ తర్వాత మరో నటిని ఎంపిక చేశారు.