తమిళ తళపతి విజయ్ హీరోగా ఆయన 66వ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నట్లు ఆదివారంనాడు ప్రకటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోంది. కాగా, సోమవారంనాడు దర్శక నిర్మాతల ఇద్దరూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు బయటకు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా ఎటువంటి విషయాలను చర్చించలేమనీ, నో పాలిటిక్స్ అంటూ దిల్‌రాజు సున్నితంగా అక్కడివారికి తెలియజేశారు. ప్రతి సినిమాకు మా బేనర్ పేరైన శ్రీవేంకటేశ్వరుని దర్శించుకుంటానని దిల్‌రాజు వెల్లడించారు.
ఆయన తన కుటుంబసభ్యులతోపాటు దర్శకుడు వంశీపైడిపల్లితోనూ దర్శనం చేసుకున్నారు. ఆయన ప్రత్యేకదర్శనం చేసుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీస్సులు అందించారు. ముఖ్యంగా దిల్‌రాజు సోదరుడు శిరీష్ కుమారుడు హీరోగా నటిస్తున్న రౌడీబాయ్స్ సినిమా వారంలో విడుదలకాబోతుంది. ఈ సందర్భంగానూ విజయ్ సినిమా ఆరంభం సందర్భంగానూ వచ్చినట్లు వెల్లడించారు.
కొత్త సినిమాల గురించి దిల్ రాజు తెలుపుతూ, రౌడీబాయ్స్, థ్యాంక్‌యూ, ఎఫ్3 సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. పేండమిక్ వల్ల కాస్త వాయిదాపడ్డాయి. రామ్‌చరణ్, శంకర్ సినిమాను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
కాగా, శనివారంనాడే పవన్ కళ్యాణ్ `రిపబ్లిక్` ఫంక్షన్‌లో థియేటర్ల విషయం గురించి ప్రస్తావిస్తూ దిల్‌రాజు కూడా ఇక్కడే వున్నారు కనుక ఆన్‌లైన్ టికెట్ల విషయంలో మీరూ మాట్లాడాలి. మీరూ రెడ్డి, ఆంధ్ర సి.ఎం. రెడ్డి కూడా రెడ్డికదా అంటూ వ్యాఖ్యానించారు. ఈమాటలకు దిల్‌రాజు ముసిముసినవ్వులు నవ్వారు. ఈ విషయమై మీడియా అడిగినా ఆయన దాటవేస్తూ వెళ్ళిపోయారు.
ఇదిలా వుండగా, విజయ్ నటించే చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ప్రస్తుతం విజయ్ నెల్సన్ దర్శకత్వంలో చేస్తోన్న తన 65వ చిత్రం `బీస్ట్` పూర్తికాగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది.