Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీణాపాణి గిన్నిస్ రికార్డ్, భారతీయులందరూ గర్వపడాలి: చిరంజీవి

వీణాపాణి గిన్నిస్ రికార్డ్, భారతీయులందరూ గర్వపడాలి: చిరంజీవి
, మంగళవారం, 29 అక్టోబరు 2019 (18:26 IST)
‘‘కళను నమ్ముకున్న కళాకారుల ప్రతిభకు అవార్డులు, రివార్డులే కొలమానాలు. అవార్డుల్లో అత్యుత్తమమైనది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు’’ అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా లండన్‌లోని భవన్స్‌ ప్రాంగణంలో సంగీత వేడుక జరిగింది. సంగీతంలోని విశిష్టమైన 72 మేళకర్త రాగాలను ఏకధాటిగా 61 గంటల 20 నిమిషాల పాటు వీణావాదన చేసి గిన్నిస్‌ను సొంతం చేసుకున్నారు తెలుగు సినిమా సంగీత దర్శకుడు వీణాపాణి. 
 
ఈ సందర్భంగా వీణాపాణిని సత్కరించిన చిరంజీవి మాట్లాడుతూ... ‘‘ఇంత గొప్ప గౌరవం దక్కటం తెలుగువారితో పాటు, భారతీయులందరి అదృష్టం. ఆమధ్య తనికెళ్ల భరణి గారి దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ చిత్రానికి వీణాపాణిగారు చేసిన సంగీతం కూడా నాకు ఎంతగానో నచ్చింది. ఇటువంటి కళాకారులను వ్యక్తిగతంగా, వృత్తిగతంగా గౌరవించటం మన సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం’’ అన్నారు.
 
‘‘మన తెలుగువాడు ఇంతటి ఘనకీర్తిని సాధించటం మనందరికీ ఎంతో గర్వకారణం’’ అన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌. తనికెళ్ల భరణి మాట్లాడుతూ, ‘‘వీణాపాణి అసలు పేరు రమణమూర్తి. ఆయనకు వీణాపాణి అని నామకరణం చేసింది నేనే అని గర్వంగా చెప్తున్నాను. వీణాపాణి అంటే సరస్వతీ దేవి. అలాంటి పేరు పెట్టుకున్నందుకు సార్ధక నామధేయుడయ్యాడు. గాంధీగారు ప్రేయర్‌ చేసుకుని తిరిగిన లండన్‌ వీధుల్లోని భవన్స్‌లో ఈయన సాధించిన ఈ అద్భుతాన్ని ప్రపంచానికి తెలియచెప్పటం కోసం గిన్నిస్‌ వారు ఆయనకు అవార్డు ప్రధానం చేయటం వీణాపాణి పూర్వజన్మ సుకృతం’’ అన్నారు.
 
దర్శకుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, ‘‘నేను దర్శకత్వం వహించిన ‘పట్టుకోండి చూద్దాం’ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా ప్రయాణం మొదలు పెట్టిన వీణాపాణి ఈ రోజున గిన్నిస్‌ అవార్డుతో రావటం నిజంగా ఎంతో గొప్ప విషయం. నాకు తెలిసి సంగీత దర్శకులలో దక్షిణ భారతదేశంలోనే ఇంతటి ప్రతిభావంతుడు మరొకరు లేడు’’ అన్నారు.
 
రచయిత–దర్శకుడు జనార్ధన మహర్షి మాట్లాడుతూ, ‘‘నేను చేసిన ‘దేవస్థానం’ చిత్రానికి సంగీత దర్శకుడు, పాటల రచయిత కూడా వీణాపాణీనే. చిన్న అవార్డు అందుకోవటం ఎంతో కష్టమైన ఈ రోజుల్లో గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించటం అంటే మాటలా. ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’’ అన్నారు.
 
వీణాపాణి మాట్లాడుతూ, ‘‘నేను సాధించిన ఈ గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డును మానస్ఫూర్తిగా ఆ మహాత్మునికి అంకితమిస్తున్నాను. ఈ అవార్డు నాతో పాటు నన్ను 28 ఏళ్లుగా భరిస్తున్న నా భార్యకు, పిల్లలకు కూడా చెందుతుంది’’ అని భావోద్వేగానికి గురయ్యారు. ఇంకా వీణాపాణి మాట్లాడుతూ, ‘‘ఇంతటి స్వరసేవ చేసే భాగ్యం నాకు దక్కించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యుక్తా లండన్‌ వారికి, అమెరికాలోని వెన్నం ఫౌండేషన్‌ వెన్నం మురళీ గారికి, భారతదేశం స్వరనిధి వారికి, లండన్‌ భవన్స్‌ వారికి, గిన్నిస్‌ అధికారులకు, భారత హై కమీషనర్‌ రుచి ఘనశ్యామ్‌ గారికి, మినిస్టర్‌ కో ఆర్డినేటర్‌ శ్రీమన్‌ప్రీత్‌ సింగ్‌ నారంగ్‌కు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి గారికి, లండన్‌ హ్యామర్‌ స్మిత్, ఫుల్‌హ్యామ్‌ మేయర్‌ కౌన్సిలర్‌ డేనియల్‌ బ్రౌన్, యుక్తా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సత్యప్రసాద్‌ కిల్లి దంపతులకు. తెలుగు సినీ పరిశ్రమలోని సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఙతలు’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడాకులు తీసుకున్న మంచు మ‌నోజ్ కొత్త జ‌ర్నీ మొద‌లైంది, ఏంటది?