20 years kushi
పవన్ కళ్యాణ్, భూమిక నటించిన `ఖుషి` సినిమాకు ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి. గూగుల్ లో చూస్తే, 26 ఏప్రిల్ అని వుంటుంది. కానీ అసలు విడుదల ఏప్రిల్ 27వ తేదీ 2001, దీని నిర్మాత ఎ.ఎం. రత్నం, ఎస్.జె. సూర్య కథ, దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ్‌లో రూపొందింది. ఆ తర్వాత తెలుగులో అటు పిమ్మట హిందీలోనూ తీశారు. మూ భాషల్లోనూ ఖుషి టైటిల్ పెట్టారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్‌ను రేణు దేశాయ్ రూపొందించింది.
ఇందులో ప్రత్యేకమైన కథంటూ ఏమీ వుండదు. విదేశాలకు వెళ్ళాలనుకున్న సిద్దుకు అనుకోకుండా యాక్సిడెంట్ కావడంతో ఇక్కడే వుండిపోవాల్సి వస్తుంది. దానికి కారణం ఏమిటి? ఆ తర్వాత ఏమి జరిగిందనేవి కథ. ఇందులో హీరో హీరోయిన్ల చిలిపి తగాదాలు యూత్‌ను అలరించాయి. సరదాగా ఆటపట్టించుకుంటూ, కాసేపు స్నేహంగా వుండే ఈ జంట తన స్నేహితుడి ప్రేమను కలిపే క్రమంలో వారు ఎలా వున్నారనే కాన్సెస్్టతో రూపొందింది.
కథనానికి ప్రాధాన్యత వున్న చిత్రమిది. భూమిక బొడ్డును చూసీచూడనట్లుగా చూసిన పవన్ కళ్యాణ్ చూపుతోనే కథ మలుపు తిరుగుతుంది. ఇందులో ఆ పాయింటే యువతను బాగా ఆకట్టుకుంది. ఇందులోని పాటలు, మాటలు, సన్నివేశాలు అన్నీ యూత్ ను మురిపించాయి, మైమరిపించాయి. దాంతో చూసిన వారే ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ 'ఖుషి'గా 'ఖుషి'తో 'ఖుషి' చేస్తూ సాగారు. ఆ యేడాది విడుదలైన బంపర్ హిట్స్ లో 'ఖుషి' కూడా ఒకటిగా నిలచింది.
యువతను ఆకట్టుకున్న పాటలు, యాక్షన్
ఇందులో పాటలు, నటనతోపాటు యువను బాగా ఆకట్టుకుంది పవన్ కళ్యాణ్ చేసిన యాక్షన్ సీన్లు. కొత్తగా అనిపించాయి. ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ కి పవన్ స్వయంగా దర్శకత్వం వహించారు. దీని చిత్రీకరణకి ఉపయోగించిన కెమేరా పనితనం మరియుమార్షల్ ఆర్ట్స్ అతనిలోని సృజనాత్మకతకి నిదర్శనాలు. ఇక పాటలు వినసొంపుగా వున్నాయి. ఇందులో తన నడుము చూశావంటూ హీరోయిన్, చూడలేదంటూ హీరో పోట్లాడుకొనే సీన్ తరువాత పలు ట్విస్టులు సాగుతాయి. అవన్నీ అప్పటి యువతీయువకులను భలేగా ఆకట్టుకున్నాయి.
మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గానూ నిలచింది. ఇందులోని పాటలలో "అమ్మాయే సన్నగా..." పాటను చంద్రబోస్ రాశారు. "హోళీ హోళీరే..." సాంగ్ ను సుద్దాల అశోక్ తేజ పలికించారు. "ప్రేమంటే సులువు కాదురా", "చెలియ చెలియా.. పాటలను చిత్ర నిర్మాత ఎ.ఎమ్.రత్నం రాశారు. "యే మేరా జహా..." అనే హిందీ పాటను అబ్బాస్ టైర్ వాలా రాయగా, పాత 'మిస్సమ్మ'లోని "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..." అనే పాటను ఇందులో రీమిక్స్ చేశారు. ఈ ఆరు పాటలు కాకుండా, "రంగబోతి రంగబోతి..." , "బై బై యే బంగారు రమణమ్మ..." వంటి జానపదాల బిట్స్ వినిపిస్తాయి. ఈ పాటలను పవన్ కళ్యాణ్ స్వయంగా పాడడం విశేషం.
ఈ సినిమా ఆడినన్ని రోజుల్లోనూ ఎక్కడ చూసినా ఆ సినిమాలోని పాటలే వినిపించేవి. ఆ రోజుల్లో రూ.20 కోట్లు వసూలు చేసి, ఆ యేడాది బంపర్ హిట్స్ లో రెండో స్థానంలో నిలచింది.