Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా కష్టకాలంలో మేకలు - గొర్రెలు ఎవరు అడిగారయ్యా... పవన్ కళ్యాణ్

కరోనా కష్టకాలంలో మేకలు - గొర్రెలు ఎవరు అడిగారయ్యా... పవన్ కళ్యాణ్
, సోమవారం, 26 ఏప్రియల్ 2021 (21:34 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రతి ఒక్కరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుజీవుడా అంటూ రోజులు గడుపుతుంటే.. ఇపుడుపోయి మేకలు గొర్రెలు ఇస్తామనడం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా పాలకులకే చెల్లుబాటు అవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. 
 
ఏపీలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆయన స్పందించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఆక్సిజన్, అత్యవసర ఔషధాల కొరతపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత నిర్లిప్తత అంటూ నిలదీశారు. 
 
విజయనగరం మహారాజా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మృతి చెందడం, విశాఖపట్నం ఆసుపత్రిలో బెడ్స్ లేక రోగులు మరణించడం వంటి దురదృష్టకర ఘటనల గురించి తెలుసుకుంటే మనసు వికలమైపోతోందన్నారు. 
 
ప్రజలు ప్రాణవాయువు, ఔషధాలు అందక ఊపిరి వదిలేస్తున్నారని... కరోనా మృతుల లెక్కలు దాయగలరేమో కానీ, బాధిత కుటుంబాల కన్నీటిని అడ్డుకోగలరా? అని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ఏపీలో ప్రతి 20 నిమిషాలకు ఒకరు కరోనాతో చనిపోతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయని, అంతకంటే ఎక్కువమందే చనిపోతున్నారని క్షేత్రస్థాయి సమాచారం చెబుతోందని వివరించారు. 
 
రాష్ట్రంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయని ఆరోపించారు. అత్యవసర ఔషధం రెమ్‌డెసివిర్ బ్లాక్ మార్కెట్లో లక్షల రూపాయలకు అమ్ముతున్నారని మండిపడ్డారు. మార్కెట్లో ఒక్కో ఇంజెక్షన్ రూ.40 వేలకు అమ్మితే సామాన్యులు, పేదలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోగలరని నిలదీశారు.
 
ఓవైపు కరోనా విలయతాండవం చేస్తుంటే మరోవైపు ఇంటింటికీ ఇంటర్నెట్ ఇవ్వడం గురించి, మహిళలకు మేకలు, గొర్రెలు ఇవ్వడం గురించి ప్రభుత్వం దృష్టి పెట్టి, సమీక్షలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు ఇంటింటికీ కావాల్సింది ఇంటర్నెట్, మేకలు, గొర్రెలు కాదని... ఆక్సిజన్, అత్యవసర ఔషధాలు అని పవన్ హితవు పలికారు. 
 
మన రాష్ట్రం మరో రోమ్ కాదని, మన పాలకులు నీరో వారసులు కారాదని నిరూపించాల్సిన తరుణం ఇదని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పదో తరగతితో పాటు.. ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తద్వారా విద్యార్థులను, వారి కుటుంబాలను కరోనా బారి నుంచి కాపాడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌పై కరోనా వైరస్ రక్కసి : 341 టన్నుల ఆక్సిజన్ చాలడం లేదు...