తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న నటీమణుల్లో హేమ ఒకరు. ఈమె ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్నారు. అదీ కూడా ఓపెన్ యూనివర్శిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆదివారం డిగ్రీ ప్రవేశ అర్హత కోసం రాత పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు నటి హేమ కూడా హాజరయ్యారు.
ఇటీవల అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పరీక్షలకు నటి హేమ దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించగా, హేమ కూడా హాజరయ్యారు. హేమకు నల్గొండ ఎన్జీ కాలేజీలో సెంటర్ కేటాయించారు. ఇతర విద్యార్థుల్లాగానే హేమ కూడా తనకు కేటాయించిన కేంద్రానికి వచ్చి పరీక్ష రాశారు. అయితే, ముఖానికి మాస్క్ ధరించి పరీక్ష హాలులోకి రావడంతో ఆమెను పెద్దగా గుర్తించలేదు. పరీక్షా హాలులో మాస్క్ తీయగా అపుడు మిగిలిన అభ్యర్థులు, ఇన్విజిలేటర్ గుర్తుపట్టారు.
దీనిపై ఆమె స్పందిస్తూ, డిగ్రీ పూర్తి చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని తెలిపారు. అయితే హైదరాబాదులో తన ఫేమ్ దృష్ట్యా ఇబ్బంది ఉంటుందని భావించి నల్గొండలో పరీక్ష రాసినట్టు తెలిపారు. ఇక్కడ తనకు బంధువులు కూడా ఉన్నారని వెల్లడించారు.
పైగా హైదరాబాదులో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉంటాయని, నల్గొండ అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని పరీక్షా కేంద్రాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు.