గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో పాటు సంగీత సామాజ్రంలో కలిసి ప్రయాణించినవారిలో కేజే ఏసుదాస్ ఒకరు. వీరిద్దరూ సొంత అన్నదమ్ముల్లా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఏసుదాస్‌ను బాలు తన గురువుగా, తండ్రిగా భావిస్తుంటారు. అందుకే ఓ సందర్భంగా ఏసుదాస్‌కు ఎస్పీ బాలు దంపతులు పాదపూజ చేశారు. అలాంటి బాలు ఇటీవలే కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన ఏసుదాస్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలును చివరి సారి చూసుకోలేకపోయానని తన బాధను వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఏసుదాస్... కరోనా నేపథ్యంలో భారత్‌కు రావడానికి అనుమతి ఇవ్వడం లేదని, బాలు కడచూపుకు నోచుకోలేకపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. బాలు ఎప్పటికీ తన జ్ఞాపకాల్లో ఉంటారని చెప్పారు. బాలు తన సొంత సోదరుడికంటే ఎక్కువని చెప్పారు.
తామిద్దరం ఎన్నో ఏళ్లు బాలుతో కలిసి ప్రయాణం చేశానని... తనతో పని చేసిన అందరి కంటే బాలునే తనకు ఎక్కువని అన్నారు. సంగీతాన్ని సాంప్రదాయబద్దంగా నేర్చుకోకపోయినా ఈ రంగంలో ఎంతో నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారని కొనియాడారు.
పాడటమే కాకుండా, సంగీతాన్ని చక్కగా కంపోజ్ చేస్తారని అన్నారు. సంగీతంలో శిక్షణ పొందిన వారు కూడా ఇంత గొప్పగా పాడలేరని అన్నారు. తామిద్దరం గత జన్మలో సోదరులమనుకుంటానని చెప్పారు. బాలు ఎవరినీ బాధించలేదని, అందరినీ ప్రేమతో పలకరించేవారని అన్నారు.