Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాట విజయం నాకెంతో సంతోషాన్నిచ్చింది, ఆ కాంబినేషన్ లు అలా ఉంటేనే బాగుంటుంది : సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్

Advertiesment
Music Director Kalyani Malik
, బుధవారం, 8 మార్చి 2023 (17:10 IST)
Music Director Kalyani Malik
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్న నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల-కళ్యాణి మాలిక్ త్రయం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన హ్యాట్రిక్ ఫిల్మ్ కావడంతో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన టీజర్, 'కనుల చాటు మేఘమా' పాట, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకొని అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా 'కనుల చాటు మేఘమా' పాటకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం విలేకర్లతో ముచ్చటించిన సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ ఈ చిత్రం గురించి, తన సినీ ప్రయాణం గురించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు.
 
మీ ప్రయాణం ఎలా సాగుతోంది?
'చెక్' సినిమా తర్వాత కోవిడ్ కారణంగా కాస్త విరామం వచ్చింది. కానీ 2022 ద్వితీయార్థం నుంచి జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మార్చి 17న విడుదలవుతోంది. దాని తర్వాత 'ఇంటింటి రామాయణం', 'విద్య వాసుల అహం' రానున్నాయి. వీటితో పాటు మరో రెండు వెబ్ సిరీస్ లు చేస్తున్నాను. ప్రస్తుతం వర్క్ పరంగా సంతృప్తిగా ఉన్నాను. ఇటీవల విడుదలైన 'కనుల చాటు మేఘమా' పాటకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది.
 
మీ కెరీర్ లో 'కనుల చాటు మేఘమా' ఉత్తమ పాట అని చాలా గొప్పగా చెప్పడానికి కారణం?
ప్రేమలు చాలా రకాలుగా ఉంటాయి. ఇది మోహం లేని మధురమైన ప్రేమ. ఇటువంటి సందర్భంలో వచ్చిన ప్రేమ పాటను నేను ఇప్పటివరకు చేయలేదు. శ్రీనివాస్ గారి అభిరుచికి తగ్గట్లుగా స్వరపరచడం జరిగింది. కేవలం ట్యూన్ మాత్రమే కాదు.. లక్ష్మీభూపాల్ గారు రాసిన లిరిక్స్, ఆభాస్ జోషి గాత్రం ఎంతో నచ్చాయి. ఈ పాట హిట్ అవ్వడంలో వాళ్ళ ప్రమేయం చాలా ఉంది. రూపుదిద్దుకుంటున్నప్పుడే ఈ పాట హిట్ అవుతుందని నాకు తెలుసు. అందుకే ముందు నుంచే ఆ పాట పట్ల ప్రేమ పెంచుకుంటూ వచ్చాను. దానికి తగ్గట్టుగానే విడుదలవ్వగానే అందరికీ నచ్చడం సంతోషాన్నిచ్చింది.
 
'ఏం సందేహం లేదు' లాంటి గొప్ప పాటలు ఇచ్చిన మీకు రావాల్సినంత పేరు రాలేదనే అభిప్రాయం ఉంది. ఏమంటారు?
ఇది సమాధానం చెప్పలేని ప్రశ్న. హిట్ అయితే అవకాశాలు వస్తాయన్న అభిప్రాయంతో అందరూ హిట్ కోసం ఎదురుచూస్తుంటారు. కానీ నా విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఏ హిట్ వచ్చినా ఆ తర్వాత దానికి తగ్గ అవకాశం రాలేదు. ఆంధ్రుడు, ఐతే, అలా మొదలైంది, అష్టాచమ్మా ఇలా ఏ సినిమా తీసుకున్నా నేను ఊహించినవిధంగా కెరీర్ లేదు. అయితే దానికి కారణమేంటి అని ఆలోచించడం కన్నా.. ఇంకా బాగా కష్టపడాలి అనే దృష్టితో పని చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానా లేదా అనే ఆలోచన మాత్రమే నాకు ఉంటుంది. నా పని పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. 2003 లో నా మొదటి సినిమా ఐతే విడుదలైంది. ఈ 20 ఏళ్లలో ఇది నా 19వ సినిమా. సంవత్సరానికి ఒక సినిమా చేస్తున్నాను. ఈ ప్రయాణంలో నా సంగీతం పట్ల ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆ విషయంలో ఆనందంగా ఉన్నాను.
 
మీ సంగీతం లేకుండా శ్రీనివాస్ అవసరాల గారి సినిమా ఉండదేమో?
అలా అని ఏం లేదండీ. నిజానికి ఈ సినిమాకి ముందుగా వివేక్ సాగర్ సంగీత దర్శకుడు. ఐదు పాటల్లో ఆయనొక పాట స్వరపరిచారు. ఈ సినిమా 2019 లోనే మొదలైంది కానీ కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్లు గ్యాప్ వచ్చింది. ఆ తరువాత వివేక్ గారు, శ్రీనివాస్ గారు అడగడంతో నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. వివేక్ సాగర్ స్వరపరిచిన పాట అప్పటికే షూటింగ్ అయిపోవడంతో.. మిగతా నాలుగు పాటలు, నేపథ్యం సంగీతం నేను అందించాను. హిట్ కాంబినేషన్ కాబట్టి వరుసగా సినిమాలు చేయాలని ఏంలేదు.. పరిస్థితులను బట్టి కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు.
 
కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేయకపోవడానికి కారణం?
అవకాశమొస్తే ఖచ్చితంగా చేస్తాను. అధినాయకుడు, బాస్ సినిమాలు చేశాను కానీ అవి ఆశించినస్థాయిలో ఆడలేదు. అవి సూపర్ హిట్ అయ్యుంటే వరుస అవకాశాలు వచ్చేవి అనుకుంటున్నాను. అవి ఫెయిల్యూర్ అవ్వడం వల్ల నెగటివ్ సెంటిమెంట్ తో కొందరు భయపడి ఉండొచ్చు.
 
సంగీతం విషయంలో దర్శకుడి పాత్ర ఎంత ఉంటుంది?
అధిక భాగం దర్శకులదే పాత్ర ఉంటుంది. దర్శకుడి అభిరుచిని బట్టే సినిమా, సంగీతం ఉంటాయి. మనం చేసే పనిలో మన స్వభావం కనిపిస్తుంది. నా సంగీతం బాగుందంటే అందులో చాలావరకు నా దర్శకులకే క్రెడిట్ ఇస్తాను.
 
మీ సోదరుడు కీరవాణి గారు స్వరపరిచిన 'నాటు నాటు' పాట ఆస్కార్ బరిలో నిలవడం ఎలా ఉంది?
అన్నయ్య స్వరపరిచిన పాట ఆస్కార్ బరిలో నిలవడం చాలా గర్వంగా ఉంది. రాజమౌళికి తన సినిమా మీద, ఆ పాట మీద ఉన్న నమ్మకమే ఇక్కడి వరకు తీసుకెళ్లింది. ఆస్కార్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే అసలు నామినేషన్స్ వరకు వెళ్లడం చాలా సంతోషాన్ని కలిగించింది.
 
ఈ సినిమాకి మీకు అవార్డు వస్తుంది అనుకుంటున్నారా?
నా సంగీతం, నా పాటలు బాగున్నాయి అని ప్రశంసలు దక్కాయి. నేను స్వరపరిచిన పాటలు పాడిన వారికి అవార్డులు వచ్చాయి. కానీ ఎందుకనో నాకు అవార్డులు రాలేదు. ఈ సినిమాకి లిరిక్ రైటర్ గా లక్ష్మీభూపాల్ గారు, సింగర్ గా ఆభాస్ జోషి అవార్డులు అందుకుంటారనే నమ్మకం ఉంది. అయితే అవార్డులు కంటే కూడా నా పాట బాగుందనే పేరే నాకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది.
 
భవిష్యత్తులో రాజమౌళి గారి సినిమాల్లో కీరవాణి గారి స్థానాన్ని మీరు భర్తీ చేసే అవకాశముందా?
అసలు దాని గురించి ఆలోచించలేదు అండీ. రాజమౌళి-కీరవాణి, సుకుమార్-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లు నాకు చాలా ఇష్టం. ఆ కాంబినేషన్ లు అలా ఉంటేనే బాగుంటాయి. రాజమౌళి సినిమాలకు అన్నయ్య అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నప్పుడు.. ఆ స్థానాన్ని ఎవరు భారీ చేస్తారని ఆలోచించడం అనవసరం. అలాగే సుకుమార్ గారంటే నాకు చాలా ఇష్టం. సుకుమార్ రైటింగ్స్ లో ఆయన నిర్మించే సినిమాకి నేను సంగీతం అందించాలని కోరుకుంటాను కానీ ఆయన దర్శకత్వం వహించే సినిమాకి సంగీతం అందించాలని కోరుకోను. రాజమౌళి-కీరవాణి, సుకుమార్-దేవిశ్రీప్రసాద్ ఆ కాంబినేషన్ లు అలా ఉంటేనే బాగుంటుందనేది నా అభిప్రాయం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప-2లో సాయిపల్లవి.. గిరిజన యువతిగా కనిపిస్తుందా?