Adi Pinchetti, Akanksha Singh and porducers
మా క్లాప్ సినిమాలో కామెడీ, డాన్స్, ఫైట్స్ వుండవు. కానీ చూసే ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో వున్నాయని- హీరో ఆది పినిశెట్టి తెలియజేస్తున్నారు. ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంటగా శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీసాయి మూవీస్ పతాకాలపై రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'క్లాప్'. బిగ్ ప్రింట్ పిక్చర్స్ అధినేత ఐ.బి. కార్తికేయన్ సమర్పిస్తున్నారు. పృథివి ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు..
క్లాప్ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈనెల 11న సోనీలివ్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా గురువారంనాడు హైదరాబాద్ ప్రసాద్‌లేబ్‌లో చిత్ర టీజర్, ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది.
అనంతరం హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ, క్లాప్ జర్నీ మొదలయి రెండున్నర సంవత్సరాలైంది. కోవిడ్ వల్ల ఆలస్యమైంది. నిర్మాతల సపోర్ట్‌తో విడుదలకు వచ్చాం. సోనీలివ్‌లో ప్రదర్శన కాబోతుంది. నేను ఈ కథను విన్నప్పుడు ప్రేక్షకుడిగా ఫీలయి విన్నాను. `రంగస్థలం` తర్వాత ఈ కథ విన్న వెంటనే చేసేద్దామని నిర్మాతలకు చెప్పా. ఇందులో కమర్షియల్ అంశాలులేకపోయినా ఆడియన్‌కు బాగా నచ్చుతుందని చెప్పగలను. చాలా కోణాలు ఇందులో దర్శకుడు చూపించాడు. నేను ఆకాంక్ష ఇద్దరమూ స్పోర్ట్స్ పర్సన్‌గా నటించాం. మా ఇద్దరి జర్నీ మరొకరి భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దిందనేది ప్రధాన అంశం. దర్శకుడు నిజాయితీగా తీశాడు. అంతే నిజాయితీగా మేమంతా నటించాం. టెక్నీషియన్స్ అలానే పనిచేశారు. ఇళయరాజాగారి రీరికార్డింగ్ సినిమాకు బలం. ఒక సీన్‌ను ఎలా వెలివేట్ చేయాలో ఆయన ఆర్.ఆర్.లో బాగా చూపించారు. మంచి సినిమా తీయాలనే పట్టుదల నిర్మాతల్లో కనిపించింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సక్సెస్ మీట్‌లో మరలా కలుద్దాం అని అన్నారు.
హీరోయిన్ ఆకాంక్ష సింగ్ తెలుపుతూ, క్లాప్ మూవీలో నటించడం గౌరవంగా భావిస్తున్నా. ఆదిగారు చాలా ఓపికతో చేశారు. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ. చాలా ఎమోషన్స్ ఇందులో వున్నాయి. నవ్వులు, బాధలు వంటి అంశాలున్నాయి. ఈ చిత్రం ఓటీటీలో విడుదలవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి అని తెలిపారు.
నిర్మాత ఎం. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నేను ఆది పినిశెట్టిగారి అభిమానిని. కథ వినగానే నిజాయితీ కనిపించింది. స్పోర్ట్స్ బేక్‌డ్రాప్‌లో ఈ తరహా సినిమా రాలేదనిపించింది. ప్రకాష్‌రాజ్, ఇళయరాజా గారు పనిచేస్తున్నారనగానే ఆనందమేసింది. ఇళయరాజాగారు బేక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. ఏదైతే అనుకున్నామో దానిని దర్శకుడు తీశాడు. ఇందులో ఆకాంక్ష, నాజర్ బాగా నటించారని అన్నారు.
మరో నిర్మాత రామాంజనేయులు జవ్వాజి మాట్లాడుతూ, క్లాప్ అనేది చాలా ఎమోషనల్ మూవీ. ఆదితో సినిమా అనగానే ఆయన ఎంపికచేసుకునే కథపై మాకు నమ్మకముంది. దానికితోడు ఇళయరాజా సంగీతం ఎసెట్. మిగిలిన సీనియర్ నటులు బాగా నటించారు. అసలు ఈ సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయాలనుకున్నాం. ఒమిక్రాన్ మూడో వేవ్ రావడంతో సోనీలివ్‌తో కమిట్ అయ్యాం. ఈ సందర్భంగా మధుర శ్రీధర్‌కు దన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు ఓటీటీలో రాబోతుంది. చూసి ఆనందించండి. ఆదిగారితో ముందుముందు సినిమాలు చేయాలనుకుంటున్నామని అన్నారు.