తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'గా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించారు. ఎ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
మార్చి 23న కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా 'తలైవి' ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. అది కూడా రెండు ప్రధాన నగరాలైన చెన్నై, ముంబైలలో 'తలైవి' ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. కంగనా రనౌత్, అరవింద స్వామి, నిర్మాతలు విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటించారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ కరుణానిధి పాత్రలో నటించగా.. జయలలిత నిచ్చెలి శశికళ పాత్రలో పూర్ణ నటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.