`ఇది ప్రీరిలీజ్ లా లేదు. ఇక్కడొక పండుగలా వుందంటూ.. జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన అభిమాననులు, ప్రేక్షకులనుద్దేశించి అక్కినేని నాగార్జున అన్నారు. బుల్లితెర స్టార్‌మహిళగా ఎదిగిన సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయితీ`. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించగా విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే6 సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్ దస్‌పల్లాలో జయమ్మ కంప్లయింట్ అనే పేరుతో జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.
వేడుకకు తగినట్లుగా వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని నుద్దేశించి అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, ఇక్కడ పండగులా వుంది. పంచాయతీ అంటే నేను రాలేదు. ప్రేమతో సుమ పిలిస్తే వచ్చాను. ఈ చిత్ర టీమ్ అంతా సుమలోని టాలెంట్‌లో 10శాతం పెట్టినా పెద్ద హిట్ అవుతుందంటూ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
నాని మాట్లాడుతూ, దేవదాస్ తర్వాత నాగ్ సార్‌తో ఇలా కలిశాం. సుమ నటించిన సినిమాకు మేం గెస్ట్‌గా రావడం కొత్తగా వుంది. మనందరి ఇంటిలో మనిషిగా సుమగారు అయ్యారు. ఇండస్ట్రీకి ఆమె చాలా చేశారు. ప్రతి సినిమా విడుదలకు ముందు సుమగారు అనే పేరు, ఆమె నవ్వు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. జయమ్మ పంచాయితీ ట్రైలర్ చూశాక, స్టేజీ మీదేకాదు వెండితెరపై కూడా అలరించిందనిపించింది. కీరవాణి సంగీతం తోడయి సినిమా చూడాలనే ఆసక్తినెలకొంది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలనీ, సుమగారు సినిమాలతో బిజీ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ, నిర్మాత బలగా ప్రసాద్‌కు బి.పి. పెరిగినట్లుగా వసూళ్ళు రావాలని చమత్కరించారు. అందరూ సినిమా చూసి ఆదరించాలి. అందం, తెలివితేటలు, మంచి మనసు వున్న సుమగారికి రాజీవ్ కనకాల (ఆర్.కె.) వుంటే చాలని పేర్కొన్నారు.
సుమ మాట్లాడుతూ, ఇంటిలో టీవీలేనిరోజుల్లో పక్కఇంటిలో టీవీచూసిన రోజులనుంచి టీవీహోస్ట్‌గా ఎదిగి ఎనర్జీగా మాట్లాడుతున్నానంటే మీ చప్పట్ల వల్ల వచ్చిన ఎనర్జీనే కారణం. మన ఇంటిలోని అమ్మాయిగా భావించం వల్లే నాకు ఎనర్జీ వచ్చింది. మీ ప్రేమ ఆదరాభిమానాలతో తెలుగు టీవీ హోస్ట్‌గా చేయడం గర్వంగా ఫీలవుతున్నాను. చిత్ర దర్శకుడు, నిర్మాత, నటించిన నటీనటులతోపాటు కీరవాణి సంగీతం మా సినిమాకు బలం చేకూరింది. నాకు శ్రీకాకులం యాస రాదు. కానీ నాకు నేర్పించిన టీమ్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాకు రామ్‌చరణ్, నాని, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, పవన్‌కళ్యాణ్ ప్రమోట్ చేయడం వల్లే హైప్ వచ్చింది. సినిమా విడుదలకు సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సునీల్‌గారు సహకారం ఎంతో వుంది. ఆల్ హీరో ఫ్యాన్స్ నా సినిమా చూస్తారని ఆశిస్తున్నానని అంటూ, మహేష్‌బాబుగారు మే3న కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని తెలిపారు.
గీత రచయిత హరి రామ జోగయ్య మాట్లాడుతూ, మల్టీటాలెంట్ సుమగారు. ఝాన్సీ, సుమ వంటివారితో సినిమా తీస్తే ఎలా వుంటుందనే ఆలోచన ఒకప్పుడు కలిగేది. ఇప్పుడు సుమగారి సినిమాకు పాట రాయడం ఆనందంగా వుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో దర్శకుడు సినిమా తీసినందుకు ధన్యవాదాలు. విలేజ్ నేటివిటీతో మలయాళ సినిమాల్లో చూసేవాళ్ళం. అదేవిధంగా జయమ్మ పంచాయితీ పెద్ద విజయం సాధించాలి. జయమ్మ భోలా మనిషి. ఊరి సమస్యలు తన సమస్యలుగా భావిస్తుంది ఈ నేపథ్యంలో పాట రాయడం ఆనందంగా వుందని అన్నారు.
ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్ ఎంతో బాగున్నాయనీ, సినిమా మంచి విజయం సాధించాలని మరో గీత రచయిత చంద్రబోస్ ఆకాంక్షించారు.
చిత్ర దర్శకుడు విజయ్ మాట్లాడుతూ, ఓసారి జర్నీ చేస్తుండగా ఓ సైంటిస్ట్ కలిసి నేను దర్శకుడు అని తెలిసి సెల్ఫీ తీసుకున్నాడు. జయమ్మ పంచాయితీ మోషన్ పోస్టర్‌ను రామ్‌చరణ్ ఆవిష్కరించాడనే విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. ఏ రంగంలోనివారికైనా సినిమాఅంటే క్రేజీనే. ఏదో చిన్న కథతో సినిమా తీయాలనుకున్న నాకు సుమగారు ఈ కథలోకి రావడం, ఆ తర్వాత సినీప్రముఖులు ప్రమోషన్‌కు సహకరించడం అదృష్టంగా భావిస్తున్నా. సుమగారి నటన గురించి వర్ణించలేం. ఎంతమందితో ఫొటో దిగినా అన్నింటిలోనూ హావభావాలు భిన్నంగా చూపుతారు. ఈ సినిమాకు కీరవాణిగారు పనిచేయడం ఆనందంగా వుంది. కీరవాణిగారు మా టీమ్‌కు జేమ్స్‌బాండ్‌లాంటివారని ఎంతో ఎనర్జీ మాకు ఇచ్చారని అన్నారు.
యాంకర్ సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ, నాకు యాంకర్‌లో గురువు ప్రదీప్. మా ఇద్దరికీ గురువు సుమగారు. 20 ఏళ్ళుగా నెంబర్1 యాంకర్‌గా సుమగారు ఎంటర్‌టైన్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా మాలాంటి ఎంతో మందికి ఆరోగ్య సమస్యలప్పుడు సహకరించారు. అలాంటి సుమగారి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ, సుమగారు టీవీ హోస్ట్‌గా చేయకపోతే మేము వెలుగులోకి వచ్చేవారం కాదు. మాకు స్పూర్తిదాయకంగా నిలిచి దారి చూపారు. మాకు ఆవిడే సచిన్, ధోనీ.. ఇండియన్ టెవివిజన్‌లో ఏకైక ప్రజెంటర్ సుమ కనకాలగారే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. లాక్‌డౌన్లోకూడా సెల్‌ఫోన్‌తో యూట్యూబ్‌కు షోలు చేసి సక్సెస్ అయ్యారని తెలిపారు.
ఈ కార్యక్రమానికి వ్యక్తిగత పనుల వల్ల హాజరుకాలేకపోతున్నామనీ రాజమౌళి, కె. రాఘవేంద్రరావు వీడియో ద్వారా తెలియజేస్తూ, జయమ్మ పంచాయితీ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రాజీవ్ కనకాల, గాయకుడు శ్రీకృష్ణ, కెమెరామెన్ అనూష్, దినేష్ కుమార్, షాలినీ తదితరులు పాల్గొన్నారు.