ఇటలీలోని టురిన్‌లో జరిగిన FISM వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ మ్యాజిక్ 2025లో ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డును సుహానీ షా గెలుచుకున్నారు. తద్వారా భారతదేశం నుంచి ఈ అవార్డుని అందుకుని చరిత్ర సృష్టించారు. ప్రపంచ మ్యాజిక్ కమ్యూనిటీకి ఎంతో గర్వకారణమైన ఈ అవార్డుని సుహానీ షా అందుకుని తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు.
ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు భారతీయ మెజీషియన్లకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ క్రియేటర్లకు కూడా ఒక మైలురాయి విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒలింపిక్స్ ఆఫ్ మ్యాజిక్ అని పిలువబడే FISM (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ సొసైటీస్ మ్యాజిక్స్) ప్రపంచవ్యాప్తంగా మెజీషియన్లకు అత్యంత ప్రతిష్టాత్మక వేదిక.
ఇందులో షా విజయం సంచలనాత్మకం. ఈ విభాగంలో గెలిచిన మొదటి భారతీయురాలు మాత్రమే కాకుండా ఈ స్థాయిలో గౌరవించబడిన కొద్దిమంది మహిళలలో ఆమె ఒకరిగా ఉన్నారు.
50 కంటే ఎక్కువ దేశాల నుండి 2,500 మందికి పైగా మెజీషియన్లు పాల్గొన్న ఈ పోటీలో జాక్ రోడ్స్, జాసన్ లడాన్యే, మొహమ్మద్ ఇమాని వంటి వారు పోటీలో ఉన్నారు. అయినప్పటికీ సుహానీ షా నేర్పు, నైపుణ్యం అక్కడి షో నిర్వాహకుల్ని, ఈవెంట్ న్యాయమూర్తులను ఆకర్షించింది.
యూట్యూబ్, ఇన్ స్టాగ్రాం, టిక్ టాక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకుని వండర్లు క్రియేట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లను గౌరవించడానికి FISM 2025లో డిజిటల్ మ్యాజిక్ అనే కొత్త కేటగిరీని ప్రవేశపెట్టింది. యూట్యూబ్‌లో 4.5 మిలియన్లకు పైగా, ఇన్ స్టాగ్రాంలో 2.1 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సుహానీ దూసుకుపోతోన్నారు.
ఆమె ప్రదర్శనలు భావోద్వేగపరంగా అందరినీ కదిలిస్తుంటాయి. మేధోపరంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రెజెంటర్ ఐఫోన్ పాస్‌కోడ్‌ను బహిర్గతం చేయడం, లైవ్ ఈవెంట్‌లో మరొకరి రహస్య ప్రేమను వెలికితీయడం వరకు షా తన మ్యాజిక్‌తో సరిహద్దులను దాటుతూనే ఉన్నారు.
జనవరి 29, 1990న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జన్మించిన సుహానీ షా ప్రయాణం అసాధారణమైనది. మార్వాడీ కుటుంబం నుండి వచ్చిన ఆమె గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏడు సంవత్సరాల వయసులో వేదికపైకి అడుగుపెట్టింది. మెజీషీయన్ అయిన తన తండ్రి నుండి తిరుగులేని మద్దతుతో చదువుని మధ్యలోనే వదిలేసి తన కలను నెరవేర్చుకునేందుకు పూర్తి సమయాన్ని కేటాయించారు.
సుహానీ గోవాలో హిప్నోథెరపీ కేంద్రాన్ని ప్రారంభించి సక్సెస్ అయ్యారు. కానీ ప్రత్యక్ష ప్రదర్శన పట్ల ఆమెకున్న మక్కువ చివరికి ఆమెను మెజీషియన్ వైపు తిరిగి తీసుకువచ్చింది. ఆమె రచించిన అన్లీష్ యువర్ ఇన్నర్ పవర్ స్వీయ-ఆవిష్కరణ, సాధికారతకు సంబంధించిన ఈ ప్రయాణాన్ని చెబుతుంది. ఇలాంటి చారిత్రాత్మక విజయం తరువాత సుహానీ షా మాట్లాడుతూ.. FISM వంటి వేదికపై గుర్తింపు పొందడం ఆనందంగా ఉంది. ఇది నా ఇన్నేళ్ల కృషికి దక్కిన ఫలితం.
అంతే కాకుండా పురాతన మ్యాజిక్ కళను ఆధునికంగా, అందుబాటులోకి తీసుకురావడానికి ఓ వేదికగా మారింది అని అన్నారు. పురుషులే ఈ కళలో రాణిస్తుంటారన్న వాదనను షా కొట్టి పారేశారు. FISMలో గత గ్రాండ్ ప్రిక్స్ విజేతలలో షిన్ లిమ్, ఎరిక్ చియెన్, యు హో జిన్ వంటి దిగ్గజాలు ఉన్నారు.
ఈ ఎలైట్ గ్రూప్‌లో సుహానీ షా చేరికతో ప్రపంచ వేదికలపై భారతీయ కళాకారుల ప్రాతినిధ్యాన్ని కూడా విస్తృతం చేసినట్టు అయింది. డైనమో, క్రిస్ రామ్సే, మైఖేల్ అమ్మర్, జేవియర్ మోర్టిమర్ వంటి జ్యూరీ మెంబర్ల సమక్షంలో సుహానీ విజయం సాధించడం విశేషం.