డ్రగ్స్ ప్రిస్కిప్షన్ రాసిచ్చేందుకు భారత సంతతికి చెందిన ఓ వైద్యుడు తన శృంగార కోర్కె తీర్చాలంటూ డిమాండ్ చేసి, వైద్య వృత్తిని దుర్వినియోగం చేశాడు. దీంతో అతనిపై ఐదు అభియోగాల కింద కేసు నమోదు చేశాడు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
డాక్టర్ రితేష్ కల్రా న్యూజెర్సీలోని సెకాకస్ ప్రాంతంలో ఫెయిర్ లాన్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అయితే అవసరం లేకుండానే అతడు తన క్లినిక్‌లో ఆక్సికోడోన్ వంటి శక్తిమంతమైన డ్రగ్స్‌ను రోగులు ఇచ్చేవాడు. అలా2019 నుంచి 2025 ఫిబ్రవరి వరకు 31,000 కంటే ఎక్కువ ఆక్సికోడోన్ ప్రిస్క్రిప్షన్లను పేషెంట్లకు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.
వాటికి అలవాటు పడిన వారు మరిన్ని మందులు కావాలని సంప్రదించేవారు. దీంతో ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలంటే తన లైంగిక కోరికలు తీర్చాలని మహిళా పేషెంట్లను బలవంతం చేసేవాడని అధికారులు తెలిపారు. తమతో అసభ్యంగా ప్రవర్తించాడని.. లైంగిక దాడికి పాల్పడ్డాడని పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ చర్యల ద్వారా అతడు చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా అధిక మోతాదు డ్రగ్స్ ఇచ్చి.. రోగుల ప్రాణాలకు ముప్పు కలిగించాడని అధికారులు పేర్కొన్నారు. దీంతో రితేష్ కల్రా వైద్య లైసెన్స్‌ను సస్పెండ్ చేసినట్లు యూఎస్ కోర్టు వెల్లడించింది. అతడు తన క్లినిక్‌ను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. అతడు దోషిగా తేలితే.. దాదాపు 20 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడే అవకాశం వుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.