Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీశ్రీ సమున్నత శిఖరం- మనమంతా అక్క‌డ గులకరాళ్ళ‌మేః త్రివిక్రమ్

Advertiesment
శ్రీశ్రీ సమున్నత శిఖరం- మనమంతా అక్క‌డ గులకరాళ్ళ‌మేః త్రివిక్రమ్
, శనివారం, 18 సెప్టెంబరు 2021 (16:06 IST)
Pavan-Trivikram
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కలసినప్పుడల్లా ఏం మాట్లాడుకుంటారు? ఏం ముచ్చట్లు చెప్పుకుంటారు? ఏ సంగతులు వారి మాటల ప్రవాహంలో దొర్లుతుంటాయి?
గడియారంలో ముళ్లు సెకన్లు, నిమిషాలు, గంటలు దాటిపోతున్నా వారి చర్చలకు తెరపడదు. జనసేనాని, త్రివిక్రమ్ ల మధ్య సంభాషణా స్రవంతి గోదారి ప్రవాహంలా సాగుతుంది. వారిద్దరూ లోతుగా చర్చించేది సినిమాల గురించా! రాజకీయాల గురించా?
 
వారి గురించి బాగా తెలిసినవారు – ఆ ఇద్దరూ మాట్లాడుకొంటుంటే అనే మాటలోని అంతరార్థం ఎప్పటికైనా ఒకటే ‘ఆ ఇద్దరూ సాహితీ చర్చల్లో ఉన్నారు’ అని. వారితోనే ఆ మాట అంటే ఈ సాహితీ మిత్రులు కూడా సరదాగా అంటూ ఉంటారు - ‘ఔను... మేం సాహితీ చర్చల మధ్య సినిమాలు చేస్తుంటాం’ అని.
 
శ్రీశ్రీ సాహిత్యం నుంచి శేషేంద్ర ఆధునిక మహాభారతం వరకూ చిన్నయసూరి వ్యాకరణం నుంచి తెలుగు శతకాల వరకూ, జాషువా కవిత్వం నుంచి చలం రచనల వరకూ, కొడవటిగంటి కథల నుంచి మధుబాబు డిటెక్టివ్ నవలల వరకూ తెలుగు సాహిత్యం గురించి కబుర్లు సురగంగా ప్రవాహంలా సాగిపోతుంటాయి.
సాహితీ మిత్రులు పవన్ కల్యాణ్, త్రివిక్రం గారు శుక్రవారం సాయంత్రం ‘భీమ్లా నాయక్’ సెట్లో మహాకవి శ్రీశ్రీ రచనా వైశిష్ట్యం గురించి, పదాల పరుగులతో పోహళింపుతో చదువరులను చైతన్యపరచడం గురించి, యువతరం రక్తాన్ని వేడెక్కించడం గురించి మాట్లాడుకున్నారు. శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న మహా ప్రస్థానం ప్రత్యేక స్మరణికను త్రివిక్రమ్ కు జ్ఞాపికగా ప‌వ‌న్ అందచేశారు. ఆ పుస్తక ముద్రణ, అందులోని అరుదైన చిత్రాల గురించి వీరు చర్చించుకున్నారు. ‘శ్రీశ్రీ కవిత్వం గురించి రెండు మాటలు చెప్పండి. మీరు చెబితే వచ్చే అందం వేరు’ అని త్రివిక్రమ్ ని ప‌వ‌న్‌ కల్యాణ్ కోరారు.
 
webdunia
Charavarthi, Pavan, trivikram,Venugopal
ఇందుకు త్రివిక్రమ్ స్పందిస్తూ “కవి తాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం. ఆయన వేసిన ఒక అడుగు. రాసిన ఒక పుస్తకం.. ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటుంది. చాలా శతాబ్దాలపాటు మాట్లాడుకొంటూనే ఉంటుంది.
ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పాడుకునే గీతం. శ్రీశ్రీ తెలుగువాళ్లు గర్వించదగ్గ కవి.. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు.. కవికుండాల్సిన ధిషణాహంకారం ఉన్నవాడు.. తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఆయన పుస్తకం చూడడం నిజంగా గొప్ప విషయం. ఆయన ఆత్మ ఎక్కడున్నా స్వతంత్రం అనే సరికి అక్కడికి వచ్చి ఆగుతుంది” అన్నారు.
 
ఇందుకు శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ ‘ఒక కవి గురించి మరో కవి చెబితే వచ్చే సొబగు ఇది’ అన్నారు. వెంటనే త్రివిక్రమ్ స్పందించి ‘శ్రీశ్రీ అంటే ఒక సమున్నత శిఖరం. మనందరం ఆ శిఖరం దగ్గరి గులక రాళ్లు’ అన్నారు. ఇలా సాగింది జనసేనాని - త్రివిక్రమ్ ల మధ్య చిన్నపాటి సాహితీ చర్చ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌హ‌ర్షి సినిమాకు మూడు అవార్డులు.. ఉత్త‌మ న‌టుడిగా ప్రిన్స్