వెండితెరపై కరుడుగట్టిన విలన్‌గా కనిపించే నటుడు సోనూ సూద్.. నిజ జీవితంలో మాత్రం తనకు మించిన రియల్ హీరో లేడని నిరూపించుకున్నాడు. లాక్డౌన్ సమయంలో కొన్ని వేల మందికి ఆపద్బాంధవుడుగా మారిపోయాడు. ఎంతోమందికి ఆపన్న హస్తం అందించాడు. వెండితెరపై హీరోలుగా వేషాలు వేస్తూ కోట్లాది రూపాయలను పోగు చేసుకునిపెట్టుకున్న హీరోలు తనకు సాటిరానని సోనూ సూద్ నిరూపించారు. కరోనా సమయంలో వ్యవస్థలన్నీ స్తంభించిపోయినపుడు తన సొంత ఖర్చులతో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చడమే కాదు, విదేశాల్లో ఉన్న వారినీ భారత్ తీసుకువచ్చిన సోనూ సూద్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు.
ఇలా ఆయన చేసిన సేవలకుగాను... పంజాబ్ ఎన్నికల సంఘం ఆయనను రాష్ట్ర ఐకాన్‌గా నియమించింది. ప్రజలతో రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్‌కు ఇది తగిన గౌరవం అని ఈసీ పేర్కొంది. సోనూ సూద్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలిసిందే. పంజాబ్‌లోని మోగా ఆయన స్వస్థలం.
కాగా, సోనూ సూద్ జీవిత ప్రస్థానంపై పెంగ్విన్ ఇండియా రాండమ్ హౌస్ ఆటో బయోగ్రఫీ విడుదల చేస్తోంది. దీనికి మీనా అయ్యర్ సహరచయిత. ఈ పుస్తకం పేరు 'అయాం నో మెస్సయా' (నేను రక్షకుడ్ని కాదు). వచ్చే నెలలో విడుదల కానున్న ఈ పుస్తకం ప్రజాదరణ పొందుతుందని భావిస్తున్నారు.