Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యూజికల్ డ్రామాలో అనిరుధ్ మ్యాజిక్ చిత్రం నుంచి గీతం విడుదల

Advertiesment
Magic party team

దేవి

, శనివారం, 15 ఫిబ్రవరి 2025 (12:24 IST)
Magic party team
ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సొంతం చేసుకుంటోంది ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ప్రస్తుతం 'జెర్సీ' వంటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'మ్యాజిక్‌' అనే సినిమాను సితార సంస్థ రూపొందిస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామాలో పలువురు యువ నటీనటులు నటిస్తున్నారు.
 
'మ్యాజిక్‌' చిత్రానికి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి 'డోంట్ నో వై' అనే మొదటి గీతాన్ని విడుదల చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా అనిరుధ్ పాట విడుదలై ఆకట్టుకోవడం కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయంగా మారిపోయింది. ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 'డోంట్ నో వై' పాటతో మరోసారి కట్టిపడేశారు అనిరుధ్.
 
'మ్యాజిక్‌' అనే చిత్ర టైటిల్ కి తగ్గట్టుగానే తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు అనిరుధ్. ఆ సంగీతానికి తగ్గట్టుగానే, ఆకట్టుకునే విజువల్స్ తో 'డోంట్ నో వై' మ్యూజిక్ వీడియోను ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో అద్భుతంగా మలిచారు.
 
అనిరుధ్ రవిచందర్, ఐశ్వర్య సురేష్ కలిసి తెలుగు, తమిళ భాష్లలో ఈ గీతాన్ని ఆలపించారు. అనిరుధ్ తన సంగీతంతో మాత్రం కాకుండా, గాత్రంతోనూ పాటకు మరింత అందం తీసుకొచ్చారు. ఈ పాట ఒకసారి వినగానే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంది. ఈ గీతానికి తెలుగులో కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, తమిళంలో విఘ్నేష్ శివన్ సాహిత్యం అందించారు. వారి సాహిత్యం పాట విలువను మరింత పెంచింది.
 
తమ కళాశాల ఫెస్ట్ కోసం సొంతంగా ఒక పాటను స్వరపరచడానికి నలుగురు యువకులు చేసే ప్రయత్నం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వారి ప్రయాణం భావోద్వేగభరితంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ 'మ్యాజిక్' చిత్రంతో ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇవ్వబోతున్నారు.
 
'మ్యాజిక్' చిత్రం కోసం ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు గిరీష్ గంగాధరన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
 
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్