ప్రముఖ హీరోయిన్ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరులు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ భూత శుద్ధి వివాహం బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో జరిగింది. సోమవారం ఉదయం అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ వివాహ వేడుకలో అత్యంత సన్నిహితులు, కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత తమ పెళ్ళికి సంబంధించిన తొలి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోవైలోని ఈషా ఫౌండేషన్‌లో ఉన్న లింగ భైరవ ఆలయంలో వీరి వివాహ వేడుక జరిగింది.
కాగా, గత 2024 నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్న విషయం తెల్సిందే. అయితే, వీరిద్దరూ ఎపుడు కూడా అధికారికంగా స్పందించలేదు. అయితే, గత కొద్ది నెలలుగా సమంత తన ఇన్‌స్టాలో పోస్టుల ద్వారా కొన్ని హింట్స్ ఇస్తూ వచ్చారు. ఇపుడు పెళ్లి చేసుకుని వీరిద్దరూ సస్పెన్స్‌కు తెరదించారు. ప్రస్తుతం ఈ నూతన జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు ఈషా ఫౌండేషన్‌తో పాటు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.