హీరో తారకరత్న కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని భావించానని, కానీ ఆయన ఇకలేరన్న వార్త తనను కలిచివేస్తుందని, హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గత మూడు వారాలుగా బెంగుళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకుంటారని భావించానని తెలిపారు. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	పైగా, నటుడిగా రాణిస్తూనే, ప్రజా జీవితంలో ఉండాలని తారకరత్న కోరుకున్నారని, కానీ, ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవడం దురదృష్ణకరమని పేర్కొన్నారు. తారకరత్న భార్యాపిల్లలలకు, తండ్రి మోహనకృష్ణకు, బాబాయి బాలకృష్ణకు, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
	 
	అలాగే, మెగాస్టార్ చిరంజీవి కూడా తన సంతాప సందేశాన్ని వెల్లడించారు. తారకరత్న అకాల మరణం గురించి తెలిసి తీవ్ర విచారానికి గురైనట్టు చెప్పారు. ఎంతో ప్రతిభ, ఉజ్వల భవిష్యత్ ఉన్న అనురాగశీలి అయిన యువకుడు తారకరత్న ఇంత త్వరగా వెళ్లిపోవడం కలచివేస్తుందన్నారు. 
	 
	తారకరత్న కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు తెలుపుతూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అలాగే, హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ ఇతర నటులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.