బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తికి భయం పట్టుకుంది. సుశాంత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిన తర్వాత అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, రియా చక్రవర్తికి పలువురు డ్రగ్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్టు సీబీఐ తేల్చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించింది. దీంతో ఆమెపై డ్రగ్ నార్కోటిక్స్ అనాలసిస్ వింగ్ కేసు కూడా నమోదు చేసింది.
ఈ క్రమంలో తాజాగా తన సోషల్ మీడియాలో నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఇందుకుగాను రక్షణ కల్పించాలని ముంబై పోలీసులకు రియా చక్రవర్తి విజ్ఞప్తి చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన రియా.. అందులో కనిపిస్తున్న వ్యక్తి మా నాన్న ఇంద్రజిత్ చక్రవర్తి, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. మేము ఈడీ, సీబీఐ దర్యాప్తులో భాగంగా మా ఇంటి నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే, ఇలా కొంతమంది ఇంటి ముందు గుమికూడి ఇబ్బంది పెడుతున్నారు.
అధికారులు మాకు సహకరించాలి. నా ప్రాణానికి, నా కుటుంబ సభ్యుల జీవితానికి ముప్పు ఉంది. స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సమాచారం ఇచ్చాం. అక్కడకి వెళ్లి సాయం కోరాం. అయినప్పటికీ వారు స్పందించలేదు. ఇన్వెస్టిగేషన్ అధికారులని కూడా కోరాం, వారి నుండి ఎలాంటి జవాబు రాలేదు. దర్యాప్తు సంస్థలతో సహాకరించడానికి మేము రక్షణ మాత్రమే కోరుతున్నాం. కోవిడ్ కాలంలో శాంతి భద్రతలని అందించాల్సిన అవసరం ఎంతైన ఉందని రియా తన పోస్ట్‌లో పేర్కొంది.
మరోవైపు, మాదక ద్రవ్యాల డీలర్లతో సంబంధం ఉన్నట్టు వస్తున్న వార్తలపై రియా తరపు లాయర్ మాట్లాడుతూ, 'రియా ఎప్పుడూ మాదక ద్రవ్యాలు తీసుకోలేదు. రక్త పరీక్షకు రియా ఏ సమయంలోనైనా సిద్ధమేన'ని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ మాదక ద్రవ్యాల కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోబోతోంది.