రెబల్‌స్టార్ ప్రభాస్... టాలీవుడ్ బాక్సాఫీస్ బాహుబలి.. ప్యాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలను చేస్తూ తెలుగు సినిమా మార్కెట్ రేంజ్‌ను ప్యాన్ ఇండియా రేంజ్‌కు మారుస్తున్న తిరుగులేని స్టార్. హీరోగా ఈశ్వర్ సినిమాతో ఆయన కెరీర్ స్టార్ అయ్యింది. యంగ్ రెబల్‌స్టార్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం సినిమా సినిమాకు మారుతూ వచ్చింది.
ప్రతి సినిమాకు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. పెద్దనాన్న కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ఇప్పుడు కృష్ణంరాజు `ప్రభాస్ మా అబ్బాయి..` అని గర్వంగా చెప్పుకునే రేంజ్‌కు రీచ్ అయ్యారు. ఓ టాలీవుడ్ హీరోపై ఎంటైర్ ఇండియన్ సినిమాలో వెయ్యికోట్ల రూపాయల పెట్టుబడుతో మూడు భారీ ప్రాజెక్టులు రూపొందుతున్నాయంటే, ప్రభాస్ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఈశ్వర్‌తో జర్నీ షురూ..!
మన తెలుగు సినీ ప్రేక్షకాభిమానులు గర్వపడేలా సినిమాలు చేస్తున్న ప్రభాస్ హీరోగా పరిచయమై 18 సంవత్సరాలవుతుంది. హీరోగా ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తన జర్నీని ప్రారంభిం చారు. 2002, నవంబర్ 11న సినిమా విడుదలైంది. తొలి చిత్రంతో హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఈ కుర్రాడు చాకులా ఉన్నాడు.. అని అప్పుడు అందరూ అనుకున్నారు. తర్వాత రాఘవేంద్రతో బాగా చేశాడనిపించుకున్నారు. ఇక వర్షం సినిమాతో అటు అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టడమే కాదు.. మాస్ ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకున్నారు ప్రభాస్.
అడవిరాముడుతో అలరించిన ప్రభాస్ చక్రంతో క్లాస్ ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. ఛత్రపతితో చేలరేగిపోయి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. పౌర్ణమితో మెప్పించిన ప్రభాస్ యోగి చిత్రంలో మదర్ సెంటిమెంట్‌తో ఆకట్టుకున్నారు. మున్నాలో కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించి యూత్ ఆడియెన్స్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్నారు. బుజ్జిగాడు చిత్రంతో కామెడీ యాంగిల్ ఎలివేట్ చేసి శభాష్ అనిపించుకున్నారు. బిల్లా సినిమాలో స్టైలిష్ హీరోగా అదరహో మాసీగా కనిపించి ఆకట్టుకున్నారు. డార్లింగ్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైన ప్రభాస్, రెబల్ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇక మిర్చి చిత్రంతో ఒకవైపు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు, మరో వైపు మాస్ ఆడియెన్స్‌ను మరోసారి మురిపించాడు ప్రభాస్. ఇక బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదగడమే కాదు.. తెలుగు సినిమా మార్కెట్ రేంజ్‌ను ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రభాస్ తప్ప ఇలాంటి పాత్రను మరొకరు చేయలేరనేంత గొప్పగా ఆ పాత్రలో ఒదిగిపోయిన ప్రభాస్ ఇప్పుడు మూడు భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు.
ప్రభాస్ అందుకే అందరికీ డార్లింగ్...
ఈశ్వర్ సినిమాతో హీరోగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రభాస్ నేటికి 18 ఏళ్ల ప్రయాణాన్ని అప్రతిహాతంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఈశ్వర్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు జయంత్ సి.పరాన్జీ మాట్లాడుతూ, ''నిజానికి నేను ప్రభాస్‌ను కలిసేటప్పుడు తను కృష్ణంరాజుగారి ఫ్యామిలీ హీరో అని తెలియదు. నిర్మాత అశోక్ ఈ విషయాన్ని నా దగ్గర దాచేశారు. నేను తనను కలిసే సమయంలో చూడగానే, ఇతను స్టార్ మెటీరియల్ అని అనిపించింది. తొలి మీటింగ్ తర్వాత అశోక్‌గారు ప్రభాస్ గురించి అసలు విషయాన్ని చెప్పారు. చెప్పగానే నేను షాక్ అయ్యాను.
తను ఓ స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలా ఫీల్ కాలేదు. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. నిజానికి హీరో ఎవరో తెలియక ముందు ఓ సాఫ్ట్ లవ్‌స్టోరి చేద్దామని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే, ప్రభాస్‌ను కలిశానో, కథలో చిన్నచిన్న మార్పులుచేర్పులు చేసుకుంటూ వచ్చాం. హీరో పాత్రను కాస్త మాస్ రేంజ్‌లో మార్చాం. మదర్ సెంటిమెంట్, లవ్‌ట్రాక్ ఇవన్నీ కలిసి సినిమా చేశాం. తొలి సినిమాతో హీరోగా ప్రభాస్ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత నేను తనతో సినిమా చేయపోయినప్పటికీ, వీలున్న సందర్భాల్లో కలుస్తూనే ఉంటాను. కలిసిన ప్రతిసారి ఆప్యాయంగా పలకరిస్తాడు. ఇంత పెద్ద స్టార్ అయిన కూడా తనతో వర్క్ చేసిన కోఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో చాలా ప్రేమగా ఉంటాడు. అప్పుడెలా ఉన్నాడో.. ఇప్పుడలాగే ఉన్నాడు. అందుకే ఆయన్ని అందరూ అంతలా అభిమానిస్తారు'' అన్నారు.
ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రంతో ప్యాన్ ఇండియా లెవల్ల్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. రాధేశ్యామ్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రభాస్‌తో జోడీ కడుతుండగా కీలక పాత్రలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నటిస్తుండటం విశేషం. ఆ వెంటనే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరావుత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తుంటే, ప్రముఖ బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడిపాత్రలో నటిస్తున్నారు.
ఇవి కాకుండా మరో రెండు భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాలు డిస్కషన్స్ దశలో ఉన్నాయి. ఇలా ప్రతి ఏడాది ప్యాన్ ఇండియా సినిమాలతో అంచనాలు పెంచుతూ, ప్రేక్షకాభిమానులను అలరిస్తున్న ప్రభాస్ ఫ్యూచర్‌లో మరిన్ని గొప్ప ప్రాజెక్ట్స్‌తో తెలుగు సినిమా స్థాయిని పెంచాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నారు అభిమానులు.