కన్నడ భామ రష్మిక మందన్నా. తెలుగులో అగ్ర హీరోయిన్‌గా ఉంది. ఆమె నటించిన ప్రతి సినిమా హిట్ అవుతుండటంతో నిర్మాతలు ఆమె కోసం క్యూకడుతున్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్. అలాంటి రష్మికకు.. ఓ అభిమాని తేరుకోలేని షాకిచ్చారు. ఒక్క సెల్ఫీ తీసుకుంటానని చెప్పి దగ్గరకు వచ్చిన ఆ అభిమాని... గబుక్కున బుగ్గపై ముద్దుపెట్టి తుర్రున పారిపోయాడు.
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో రష్మిక సహా అక్కడున్న వారందరూ షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'చలో' సినిమాతో తెరంగేట్రం చేసిన రష్మిక.. 'సరిలేరు నీకెవ్వరు'తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆమె నటించిన 'భీష్మ' సినిమా ఈ నెల 21న రిలీజ్ కాబోతోంది.
ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రష్మికను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీల కోసం రిక్వెస్ట్ చేశారు. అభిమానులను నిరాశపరచడం ఇష్టంలేని రష్మిక వారితో సెల్ఫీలు దిగింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగి ఆ వెంటనే ముద్దు పెట్టి పరారయ్యాడు.
ఇది చూసిన అందరూ షాక్. అభిమాని ఆమెకు ముద్దుపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో స్పందించిన రష్మిక కార్యక్రమ నిర్వాహకులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించారు.