ఎప్పుడూ వివాదాలలో మునిగి తేలుతూ ఉండే రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఎన్నికలపై పడ్డారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లతో చెలరేగిపోతున్న వర్మ తాజాగా ముగిసిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా పరాజయం పొందడాన్ని గుర్తు చేస్తూ తారక్‌ను ఉద్దేశించి వరుస ట్వీట్‌లు చేయగా అవి వైరల్‌గా మారాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండి పరోక్షంగా జగన్‌కు మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, లోకేశ్‌లపై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఇక ప్రత్యక్షంగా ఏ రాజకీయ సభలలోనూ పాల్గొనని వర్మ గురువారం ఘనంగా జరిగిన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే మళ్లీ ట్వీట్‌ల బాట పట్టారు వర్మ. ఈ ట్వీట్‌లలో టీడీపీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ చేతికి అప్పగించాలని, 2019 ఎన్నికలలో జరిగిన ఈ ఘోర పరాభవాన్ని ప్రజలు మర్చిపోయేలా ఆయన మాత్రమే చేయగలరని సూచించారు.
టీడీపీని తిరిగి నిలబెట్టే సత్తా కేవలం తారక్‌కి మాత్రమే ఉందని, తన తాత పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా ఎన్టీఆర్ వెంటనే టీడీపీ పగ్గాలను చేపట్టాలని ట్వీట్ చేసారు వర్మ.
చివరిగా చేసిన ట్వీట్‌లో ''తారక్ నిన్ను అభ్యర్థస్తున్నా.. దయచేసి మీ బాబాయ్ దారిలో వెళ్లొద్దు. మీ తాతకు అల్లుడు పొడిచిన వెన్నుపోటు కంటే మీ బాబాయ్ పొడిచినదే పెద్దది'' అంటూ పరోక్షంగా బాలయ్యపై కామెంట్లు విసిరారు.