నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రానికి సంబంధించి పలు పోస్టర్స్ విడుదల చేశారు.
అయితే మర్డర్ సినిమా పోస్టర్, దానిపై ఆర్జీవీ సోషల్‌మీడియా వేదికగా చేసిన వాఖ్యలపై ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ఎస్సీ,ఎస్టీ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి నాగరాజు విచారణ జరిపారు.
దర్శకుడు రాంగోపాల్‌వర్మతోపాటు నిర్మాత నట్టి కరుణలపై కేసు నమోదుచేసి విచారణ జరపాలని శనివారం మిర్యాలగూడ ఒకటో పట్టణ పోలీసులకు ఆదేశాలు జారీచేశారు
ఈ కేసుపై తాజాగా తన ట్విట్టర్ ద్వారా స్పందించారు వర్మ. 'నేను చేస్తున్న మర్డర్ సినిమాలో ఎవరిని కించపరచడం, ఏ కులాన్ని ప్రస్తావించడం చేయలేదు అని ఇప్పటికే చెప్పాను. మర్డర్ సినిమాని వాస్తవ ఘటన ఆధారంగా చేస్తున్నామే తప్ప నిజమైన కథ కాదు' అని వర్మ చెప్పుకొచ్చారు.
చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను కూడా ప్రాథమిక హక్కులని పరిరక్షించడానికి లీగల్‌గా ముందుకు వెళతాను అని వర్మ స్పష్టం చేశారు. పైగా, తనపై నమోదైన కేసుకు తమ లాయర్లే సమాధానం చెపుతారని వెల్లడించారు.
కాగా, మిర్యాలగూడకు చెందిన రియల్టర్ మారుతి రావు, కుమార్తె అమృత, ఈమె ప్రియుడు ప్రణయ్ కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని ఆర్జీవీ నిర్మిస్తున్నారు.