మెగా కాంపౌండ్ హీరో రామ్ చరణ్ నటించిన చిత్రం రంగస్థలం. సమంత హీరోయిన్ కాగా, లెక్కల మాస్టారు కె.సుకుమార్ దర్శకత్వం వహించారు. సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాక బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. రంగస్థలం చిత్రం 1985 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని అందించింది.
చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంకి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలలో కనిపించి సందడి చేశారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని సౌత్‌లోని పలు భాషలలో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో కనిపించి సందడి చేస్తే సమంత రామలక్ష్మీ పాత్రలో కనువిందు చేసింది. ఈ చిత్రం సైమాలో విజయ దుందుభి మోగించింది. ఏకంగా తొమ్మిది అవార్డులను దక్కించుకుంది.
ఈ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సపోర్టింగ్ రోల్‌లో అనసూయ, ఉత్తమ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, క్రిటిక్స్ ఉత్తమ నటి సమంత, ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (ఎంత సక్కగున్నవవే ), ఉత్తమ గాయని ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఉత్తమ కళా దర్శకడు రామకృష్ణ అవార్డులు అందుకున్నారు.