Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదాయం లేదు ఆస్తి పన్ను చెల్లించలేనంటూ మొండికేసిన రజినీ వెనక్కితగ్గారు!!

Advertiesment
Rajinikanth
, గురువారం, 15 అక్టోబరు 2020 (10:38 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా ఆదాయం లేని తన కళ్యాణ మండపానికి ఆస్తి పన్ను చెల్లించనేనంటూ మొండికేసిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. మద్రాసు హైకోర్టు హెచ్చరికతో ఆయన దిగివచ్చారు. దీంతో ఆయన తన కళ్యాణమండపానికి చెల్లించాల్సిన ఆస్తి పన్ను చెల్లించేందుకు సిద్ధమయ్యారు. 
 
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు చెన్నై కోడంబాక్కంలో శ్రీరాఘవేంద్ర కళ్యాణ మండపం ఉంది. అయితే, కరోనా లాక్డౌన్ కారణంగా గత మార్చి నెల నుంచి ఈ కళ్యాణ మండపం మూసివేసివున్నారు. దీంతో గత ఏడు నెలలుగా నయాపైసా ఆదాయం లేదు. ఈ క్రమంలో రూ.6.50 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ చెన్నై నగర పాలక సంస్థ రజినీకాంత్‌కు నోటీసు పంపించింది. 
 
దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కరోనా లాక్డౌన్ కారణంగా పైసా ఆదాయం లేదని అందువల్ల ఆస్తి పన్ను చెల్లించనేనంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మార్చి నుంచి లాక్డౌన్ కారణంగా ఏ విధమైన కార్యక్రమాలూ అక్కడ జరగలేదని, దీంతో ఆదాయం రానందున పన్ను కట్టలేమని పేర్కొన్నారు. 
 
ఇదే విషయాన్ని అధికారులకు చెప్పినా వారు స్పందించలేదని గుర్తుచేశారు. మార్చి 24 నుంచి అన్ని మ్యారేజ్ హాల్స్ బుకింగ్స్‌నూ ప్రభుత్వం రద్దు చేసిందని కూడా చెప్పారు. చెన్నై మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1919లోని సెక్షన్ 105ను ఉదహరిస్తూ, ఆస్తి పన్నును తగ్గించాలని అన్నారు. 
 
అయితే, విచారణ అనంతరం రజనీ అపీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును కట్టాల్సిందేనని, లేకుంటే రజనీకాంత్ జరిమానాను ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించింది. కోర్టు హెచ్చరికల తర్వాత, తన క్లయింట్ పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నారని రజనీ తరఫు న్యాయవాది వెల్లడించారు.
 
ఆ తర్వాత ఈ అంశంపై రజినీ తరపు న్యాయవాది విజయన్ మీడియాతో మాట్లాడుతూ, "50 శాతం వరకూ ప్రాపర్టీ ట్యాక్స్‌ను తగ్గించే అవకాశం చట్టంలో ఉంది. ఏదైనా ప్రాపర్టీని వినియోగించకుండా ఖాళీగా ఉంచితే సగం పన్ను కడితే సరిపోతుందని వుంది. ఆ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తాం. మా పిటిషన్‌ను వెనక్కు తీసుకుంటున్నట్టు న్యాయమూర్తికి తెలియజేశాం" అన్నారు.
 
కాగా, ఇదే విషయమై స్పందించిన ప్రాపర్టీ ట్యాక్స్ అధికారులు, చట్టంలో పన్ను తగ్గింపు అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తమకు తెలియదని, అయితే, ఈ నెల 15లోగా పన్ను చెల్లించే వారికి డిస్కౌంట్‌ను ఇస్తున్నామని, లేకుంటే జరిమానా తప్పదని వ్యాఖ్యానించడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్, ఆ విషయంలో అవినాష్ బాగా వీక్?