తన నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించవద్దని దర్శకుడు రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి అన్నారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తాను ఎవరి సానుభూతి కోసం వెంపర్లాడటం లేదన్నారు. పైగా, తాను ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వనని స్పష్టంచేశారు. తన నుంచి బ్రేకింగ్ న్యూస్‌లు, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు ఆశించవద్దని కోరారు. సమంత - రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్న తర్వాత అందరూ తనపై జాలి చూపిస్తున్నారని.. కానీ, తాను ఏ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు.
'నాపై ప్రేమాభిమానాలు చూపుతున్న అందరికీ కృతజ్ఞతలు. మీ అందరి ఆశీర్వాదాలు నాకు అందుతున్నాయి. కానీ, నేను ప్రస్తుతం ఎలాంటి విషయాల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే మా గురువు కేన్సర్ బారిన పడినట్లు ఇటీవల తెలిసింది. నేను ఆయన కోసం ప్రార్థిస్తున్నాను. నాకు ఎలాంటి పీఆర్ టీమ్ లేదు. నా సోషల్ మీడియా ఖాతాలను నేనే మెయిన్‌టెన్ చేస్తాను. నేను మా గురువు గురించి ఆలోచిస్తూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా. ఆ కారణంగా మీ అందరికీ స్పందించలేను. నా బాధను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి. మీడియా వారు నాపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. అందరూ సంతోషంగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను' అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
కాగా, ప్రముఖ హీరోయిన్ సమంతను సినీ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరు డిసెంబరు ఒకటో తేదీ కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లోని లింగభైరవ ఆలయంలో వివాహం చేసుకున్న విషయం తెల్సిదే. రాజ్, సమంతలకు ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాజ్ మాజీ భార్య శ్యామాలి అంశం తెరపైకి వచ్చింది.