సినిమా పైరసీకి కేంద్ర బిందువుగా ఉన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవి అరెస్టు నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మంగళవారం విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ, కడుపు మంటతో, బాధతో మాట్లాతున్నట్టు చెప్పారు. ఒకవేళ అదే జరిగితే.. ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారన్నారు. ఎంతగానో శ్రమించి రవిని పట్టుకున్న పోలీసు అధికారులను ఛాంబర్ తరపున త్వరలో సత్కరిస్తామని చెప్పారు.
'నేను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీగా ఉన్న సమయంలో.. యాంటీ వీడియో పైరసీ సెల్ ఏర్పాటైంది. పైరసీని అరికట్టడం సాధ్యమేనా? అని అప్పుడు చాలామంది సందేహించారు. మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలన్న బాధ్యతతో దానిని ప్రారంభించాం. కొందరు విశ్రాంత పోలీసు అధికారులు అందులో భాగమయ్యారు. హాలీవుడ్ చిత్రాల పైరసీని అరికట్టాం.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కృషిని స్కాట్లాండ్ పోలీసులు గుర్తించి, ప్రశంసించారు. కొంతకాలం ఫండ్ కూడా పంపించారు. ఆస్ట్రేలియా కేంద్రంగా సినిమాలను పైరసీ చేసిన ఓ వ్యక్తిని పట్టించాం. దేశంలో యాంటీ వీడియో పైరసీ సెల్‌ను నిర్వహిస్తోంది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఒక్కటే. ఒకానొక సమయంలో దానిని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఎదురైనా.. కొనసాగిస్తున్నాం' అని వివరించారు.