మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ తనయుడిగా చిత్రసీమలో అడుగు పెట్టిన ప్రణవ్, అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. 'హృదయం'తో భాషలకు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'డియాస్ ఇరాయ్'. మిస్టరీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది.
కమల్ హాసన్ 'పుష్పక విమానం', 'నాయకుడు' నుంచి ధనుష్ 'రఘువరన్ బీటెక్' వరకు తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేసిన పరభాషా సినిమాలు భారీ విజయాలు సాధించడంతో పాటు విమర్శకుల - ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. అందువల్ల, 'డియాస్ ఇరాయ్' మీద ప్రేక్షకులతో పాటు బిజినెస్ వర్గాల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
'హృదయం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రణవ్ మోహన్ లాల్ వరుసగా సినిమాలు చేయలేదు. సెలక్టివ్‌గా కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. 'భూత కాలం', మమ్ముట్టి 'భ్రమ యుగం' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్, ఈ 'డియాస్ ఇరాయ్'ను తెరకెక్కించారు. మలయాళ, తమిళ భాషల్లో అక్టోబర్ 31న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ 'డియాస్ ఇరాయ్' మలయాళ వెర్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు శ్రీ స్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్. సుష్మితా భట్, జిబిన్ గోపీనాథ్, జయ కురుప్, మనోహరి జాయ్, అరుణ్ అజికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన 'డియాస్ ఇరాయ్' తెలుగు వెర్షన్‌ను నవంబర్ తొలి వారంలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.
విభిన్న కథలతో తెరకెక్కిన 'ప్రేమలు', '2018', 'మంజుమ్మేల్ బాయ్స్', 'కొత్త లోక' వంటి మలయాళ సినిమాలకు తెలుగులో చక్కటి ఆదరణ లభించింది. ఆయా సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ జాబితాలో 'డియాస్ ఇరాయ్' కూడా చేరుతుందని చిత్ర బృందం భావిస్తోంది.
ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వంలో రూపొందిన 'డియాస్ ఇరాయ్' చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంస్థలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు.