దేశంలో కరోనా వైరస్ భీకర ప్రళయాన్ని సృష్టిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఎందరో బతుకులు చిన్నాభిన్నమైపోతున్నాయి. కరోనా బారిన పడినవారు వైద్యం అందక లబోదిబోమంటున్నారు.
ఇలాంటి వారికి తమవంతు సాయం అందించేందుకు సినీ సెలబ్రిటీలు నడుం కట్టారు. తాజాగా 'రాధేశ్యామ్' నిర్మాతలు కొవిడ్ బాధితుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న 'రాధేశ్యామ్' సినిమాలో హాస్పిటల్ సీన్ కోసం 50 సెట్ ప్రాపర్టీలను రూపొందించారు.
ఇందులో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, స్ట్రెచర్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయట. వీటన్నింటిని 9 పెద్ద ట్రక్‌లు ఉపయోగించి ఆసుపత్రికి చేర్చారట రాధేశ్యామ్ నిర్మాతలు. వారు చేసిన పనికి ప్రశంసలు లభిస్తున్నాయి. కాగా, 'రాధేశ్యామ్' చిత్రాన్ని జూలై 30న విడుదల చేస్తామని మేకర్స్ ముందుగా ప్రకటించారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ తేదీన రాధేశ్యామ్ విడుదల కావడం అనుమానమే.