ఇటీవల వివిధ చానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలు, సామాజిక మాధ్యమాల్లో ఆయన సినిమాల్లో నటించే మహిళలపై అసభ్యకర విమర్శలు చేసిన సినీ దర్శకుడు గీతాకృష్ణపై వైజాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గీతాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విశాఖపట్టణం ఉమెన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (వావా) సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీకి ఫిర్యాదు చేశారు.
గీతాకృష్ణ అక్కయ్యపాలెంలో గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్, హైదరాబాద్ మాదాపూర్‌లో మరో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నడుపుతున్నారు. ఇటీవల వివిధ చానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలు, సామాజిక మాధ్యమాల్లో ఆయన సినిమాల్లో నటించే మహిళలపై అసభ్యకర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ కోరారు.
గతంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన గీతాకృష్ణ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ పరిశ్రమలో జరిగే వ్యవహారాలపై షాకింగ్ కామెంట్స్, చేశారు. ధనవంతులు పిల్లలే డ్రగ్స్ వాడుతారని, సాధారణ ప్రజలకు ఆదేంటో తెలియదని అన్నారు. ఇండస్ట్రీలో చాలామంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని పేర్కొన్నారు.
అలాగే, సినిమాల్లో రొమాంటిక్ సీన్లను అమ్మాయిలు ఇష్టంతో చేయరని చెప్పారు. రూ.50 లక్షలు ఇస్తే హీరోయిన్లు గెస్ట్‌హౌస్‌కు వెళతారని పేర్కొంటూ వెగటు వ్యాఖ్యలు చేశారు. ఇవే కాదు, సమయం చిక్కినపుడల్లా పరిశ్రమలోని మహిళలపై ఆయన నోరు పారేసుకుంటున్నారంటూ 'వావా' తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వైజాగ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.