హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌పై ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. పోలీసులకు సైతం సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం, నగర సీపీ సజ్జనార్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. దీంతో సజ్జనార్‌తో పాటు ఆయన బృందాన్ని పవన్ పొగడ్తల్లో ముంచెత్తారు.
సినిమా పైరసీకి అడ్డగా ఉన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. వారంతా పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో పవన్‌కల్యాణ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
'డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలు విడుదలైన రోజే ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తున్నాయి. దీనివల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. సినిమా విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదు.
పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్‌సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామం. పోలీసులకు సైతం సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుబృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్‌లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ వి.సి.సజ్జనార్‌కి అభినందనలు తెలియజేస్తున్నా' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.