స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". 'కథానాయకుడు', 'మహానాయుకుడు' అనే పేర్లతో రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో పలు పాత్రల కోసం అనేక మంది నటీనటులను ఎంపిక చేస్తున్నారు. సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ను అపుడపుడూ చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తూ వస్తోంది.
ఈ క్రమంలో తాజాగా మరో పోస్టర్ వచ్చేసింది. పంచె కట్టులో బాలయ్య ఆవేశంగా నడుచుకుంటూ వస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే అచ్చం అన్నగారిని తలపించారని ఫ్యాన్స్ అంటున్నారు. తండ్రి పోలికలే కాదు.. తండ్రి హావభావాలు కూడా దించేశారని బాలయ్యను ప్రశంసిస్తున్నారు.
ముఖ్యంగా పంచెకట్టులో బాలయ్య అదుర్స్ అనిపించారని, అన్నగారిని గుర్తు చేశారని కితాబిస్తున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌ను చూడని వాళ్లకు ఇప్పుడు బాలయ్యను చూస్తుంటే అలాగే ఉంటాడేమో అనిపిస్తుందని పొగుడుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్ నటిస్తోంది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, బాలకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మొదటిభాగం వచ్చే యేడాది జనవరి 9వ తేదీన, రెండో భాగాన్ని అదే నెలలో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.