Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భూములు పంచుకోవడానికి కాదు.. ఇండస్ట్రీ బాగుకోసమే వెళ్లారు : నాగబాబు

Advertiesment
Naga Babu
, గురువారం, 28 మే 2020 (18:36 IST)
ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. లాక్డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో షూటింగ్‌లకు కూడా అనుమతి ఇవ్వాలని వారు ఈ సందర్భంగా కోరారు. దానికంటే ముందు.... తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ భేటీ మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరుగగా, మెగాస్టార్ నివాసానికే మంత్రి తలసాని వచ్చారు. 
 
ఆ మరుసటి రోజు సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు అంటే, చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, సి.కళ్యాణ్, దిల్ రాజు వంటి మరికొందరు ప్రముఖులు సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో సమావేశమై, తమ కష్టాలు చెప్పుకున్నారు. కరోనా కష్టకాలంలో సినీ ఇండస్ట్రీని ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అలాగే షూటింగులకు అనుమతి ఇవ్వాలంటూ ప్రాధేయపడ్డారు. ఇంతవరకు బాగానేవుంది. 
 
అయితే, గురువారం మే 28వ తేదీన స్వర్గీయ ఎన్టీరామారావు జయంతి సందర్భంగా ఆయన తనయుడు, హీరో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకునేందుకు ఇండస్ట్రీ సీనియర్లు వెళ్లారా? అంటూ బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో నిర్మాత సి కళ్యాణ్ వివరణ ఇచ్చారు. 
 
ఇపుడు మెగాబ్రదర్ నాగబాబు ఒక అడుగు ముందుకేసి బాలకృష్ణపై విమర్శల వర్షం కురిపించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని... ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన వారినే కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని సైతం కించపరిచేలా ఆయన వ్యఖ్యలు ఉన్నాయిని మండిపడ్డారు. 
 
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలు భేటీ అయ్యారని, ఇక్కడ షూటింగ్‌లను ఎలా ప్రారంభించాలనే దానిపై చర్చించారని తెలిపారు. అయితే చిరంజీవి ఇంట్లో కలుద్దామని మంత్రి చెప్పారా? లేదా? అనే విషయం తనకు తెలియదన్నారు. 
 
కానీ, ఈ సమావేశానికి తనను పిలవలేదని బాలకృష్ణ చెప్పడంలో తప్పులేదని... అయితే భూములు పంచుకుంటున్నారని అని ఆరోపించడం దారుణమన్నారు. ఆ తర్వాత ఏదో బూతు మాట కూడా మాట్లాడినట్టున్నారని... మీడియాలో దాన్ని బీప్ చేశారని అన్నారు.
 
సమాచారలోపం వల్ల బాలకృష్ణను సమావేశానికి పిలిచి ఉండకపోవచ్చని... అయితే, భూములను పంచుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఒక నిర్మాతగా, నటుడిగా తనకు బాధను కలిగించాయని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నోటికి వచ్చినంత మాట్లాడటం సరికాదని, ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
ఇలాగే మాట్లాడతానని అంటే... అంతకు పది రెట్లు మాట్లాడేవారు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఇండస్ట్రీ బాగు కోసమే వెళ్లారు కానీ, భూములు పంచుకోవడానికి కాదు బాలకృష్ణగారూ అని అన్నారు. ఇండస్ట్రీకి మీరేం కింగ్ కాదు... మీరు కూడా ఒక హీరో మాత్రమే అని మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలకృష్ణకు అవమానం జరిగితే సహించను : నిర్మాత సి. కళ్యాణ్