న్యూయార్క్: అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో అక్కడ తెలుగువారు ఎలా ఉన్నారనే దానిపై ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ఆరా తీశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నాయకులకు ఫోన్ చేసి అమెరికాలో ఉంటున్న తెలుగువారు యోగక్షేమాలు కనుక్కున్నారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్, న్యూయార్క్‌లో ప్రముఖ వైద్యులు నాట్స్ మాజీ చైర్మన్ మధు కొర్రపాటికి ఫోన్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కనుక్కున్నారు.
ముఖ్యంగా తెలుగువారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది అడిగి తెలుసుకున్నారు. తెలుగువారంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. తెలుగు సంఘాలు వారిని ఎప్పటికప్పుడూ కరోనా కట్టడిపై చైతన్యపరచాలని కోరారు. ఇండియా సమయం ప్రకారం శుక్రవారం తెల్లవారు ఝామున నాలుగు గంటలకు ఈ కాల్ చేసినట్టు నాట్స్ నాయకులు తెలిపారు.
కరోనా కష్టకాలంలో తెలుగువారికి అండగా నిలవాలని కోరినట్టు చెప్పారు. అమెరికాలో తెలుగువారిని అప్రమత్తం చేస్తూ నాట్స్ కార్యక్రమాల చేస్తుందని.. తెలుగునాట కూడా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తుందని ఈ సందర్భంగా డా. మధు కొర్రపాటి బాలకృష్ణకు వివరించారు. తెలుగువారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనేదే తన అభిమతమని బాలకృష్ణ అన్నట్టు మధు తెలిపారు.