బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ నటిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన టాలీవుడ్ ప్రముఖులు.. ఆమె సినీ నటి కాదనీ, బుల్లితెర ఆర్టిస్ట్ అని, పైగా, ఆమెకు పెద్దగా గుర్తింపు కూడా లేదని వివరణ ఇచ్చారు.
కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణలో చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. పలువురు టాలీవుడ్ హీరోయిన్ల పేరు తెరపైకి వచ్చాయి. ఇది మరచిపోకముందే శాండిల్‌వుడ్‌లో కూడా డ్రగ్స్ దందా తెరపైకి వచ్చింది. ఇక్కడ ఇద్దరు హీరోయిన్లను బెంగుళూరు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలో ఇపుడు ముంబై ఎన్సీబీ అధికారులు టాలీవుడ్ నటిని అరెస్టు చేసిందన్న వార్త కలకలం రేపుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ తెలుగు నటిని ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో శనివారం రాత్రి తాము అదుపులోకి తీసుకున్నామని ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి.
తొలుత ముంబై ఎన్సీబీ అధికారులు బాంద్రా రైల్వే స్టేషన్ (ఈస్ట్)లో శనివారం మహమ్మద్ చాంద్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో బాంద్రా ఏరియా నుంచి 400 గ్రాముల మెఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించగా మహమ్మద్ సయీద్ అనే వ్యక్తి వద్ద పెడ్లర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపాడు.
దీంతో సయీద్ కోసం మీరా రోడ్‌లోని హోటల్‌లో ఎన్‌సీబీ అధికారులు దాడులు జరిపారు. ఎన్‌సీబీ అధికారులను చూసిన సయీద్ పారిపోయాడు. కానీ, అతనితో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఓ నటి చిక్కింది. దీంతో ఆమెకు సమన్లు జారీ చేసిన ఎన్‌సీబీ అధికారులు స్టేట్‌మెంట్ రికార్డు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె ముంబైలో ఎందుకుంది? డ్రగ్స్ సప్లయర్ అయిన సయీద్‌తో ఆమెకు ఏం పని? హైదరాబాద్ నుంచి వచ్చే డ్రగ్స్‌తో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ విషయమై ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మాట్లాడుతూ.. ఈ విషయంలో కేసు నమోదు చేసిన మాట వాస్తవమేనని, కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.
కాగా, ముంబైలో తెలుగు నటిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారన్న వార్త వినగానే టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. ఇంతకు ఎవరా నటి? అన్న అంశం టాలీవుడ్ వర్గాల్లో ఆదివారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్‌సీబీ అధికారులు మాత్రం అరెస్టయిన నటి సినిమా తార కాదని, సీరియల్ నటి అని.. అంతగా పాపులర్ కూడా కాదని చెబుతున్నారు.